Plants : మనం ఇంట్లో అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. వాటిల్లో కొన్ని ఔషధ మొక్కలు కూడా ఉంటాయి. వాటి వల్ల కలిగే ఉపయోగాలు తెలియక వాటిని ఉపయోగించుకోలేకపోతుంటారు. మనం ఇంట్లో పెంచుకునే కొన్ని రకాల ఔషధ మొక్కలను ఆయుర్వేదంలో కూడా విరివిరిగా ఉపయోగిస్తారు. ఈ ఔషధ మొక్కలు హానిరహితమైనవి. వీటిని పెంచుకోవడం వల్ల అలాగే వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ ఔషధ మొక్కలను వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. పరిస్థితులు విషమంగా ఉన్నప్పుడు వీటి మీద ఆధారపడకుండా వైద్యున్ని సంప్రదించడం చాలా ముఖ్యం.
ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే కొన్ని ఔషధ మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం పెంచుకోవడానికి వీలుగా ఉండే ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో తులసి మొక్క కూడా ఒకటి. హిందూ సంప్రదాయంలో ఈ మొక్కకు ఎంతో విశిష్టత ఉంటుంది. తులసి ఆకులను ఉపయోగించడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆకులను నేరుగా లేదా కషాయంగా చేసుకుని తీసుకోవచ్చు. తులసి మొక్కలో రామ తులసి, కృష్ణ తులసి, కర్పూర తులసి, వాన తులసి వంటి నాలుగు రకాలు ఉంటాయి. కర్పూర తులసిని ఎక్కువగా బాహ్య ప్రయోజనాల కోసం వాడుతూ ఉంటారు.
కర్పూర తులసి నుండి తీసిన నూనెను చెవి ఇన్ ఫెక్షన్ లను తగ్గించడంలో ఉపయోగిస్తారు. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాస కోస సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా తులసి మనకు ఉపయోగపడుతుంది. జ్వరం, సాధారణ జలుబు, దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలను నయం చేయడంలో రామ తులసిని ఎక్కువగా వాడతారు. తులసి మలేరియాను నయం చేయడంలో కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాకుండా అజీర్తి, తలనొప్పి, నిద్రలేమి, మూర్ఛ, కలరా వంటి అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా తులసి మనకు సహాయపడుతుంది.
ఇక ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండడంతోపాటు ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో మెంతి కూడా ఒకటి. మొంతి ఆకులతోపాటు మెంతులు కూడా పోషక విలువలను, ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సులభంగా పెంచుకోవచ్చు. శరీరంలో అధికంగా ఉన్న వేడిని తగ్గించడంలో మెంతి ఎంతో దోహదపడుతుంది. మెంతిలో కాలేయ క్యాన్సర్ ను అరికట్టే గుణం మెండుగా ఉంటుంది. బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచే శక్తి కూడా మెంతికి ఉంది. కడుపులో మంట, అల్సర్ వంటి వాటి చికిత్సలో కూడా మెంతిని ఉపయోగిస్తారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించే గుణం కూడా దీనికి ఉంది. చెడు గాలిని తొలగించి మంచి గాలిని అందించడంలో కూడా మెంతి మనకు తోడ్పడుతుంది. ఇది అందరి ఇండ్లల్లో తప్పకుండా ఉండాల్సిన మొక్క అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంట్లో సులభంగా పెంచుకునే మొక్కలల్లో నిమ్మచెట్టు కూడా ఒకటి. దీనిని కుండీలో కూడా పెంచుకోవచ్చు. నిమ్మ మొక్కలో కూడా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిని టీ, సలాడ్ వంటి వాటిలో వాడుతూ ఉంటారు. ఒత్తిడిని, నరాల సంబంధిత సమస్యలను తగ్గించడంలో, అధిక రక్తపోటును నియంత్రించడంలో నిమ్మ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. జ్వరాన్ని, గొంతు ఇన్ ఫెక్షన్ లను, కొన్ని రకాల శ్వాస సంబంధిత సమస్యలను, కండరాల నొప్పులను, కీళ్ల నొప్పులను, కడుపు నొప్పిని తగ్గిండచంలో కూడా దీనిని వాడుకోవచ్చు.
కలబంద.. ఇది దాదాపు అందరి ఇండ్లల్లో ఉండే ఉంటుంది. ఇది ఒక అద్బుతమైన మొక్క. ఎక్కడైనా చాలా సులభంగా పెరుగుతుంది. ఇది పెరగడానికి మంచి సూర్యకాంతి అవసరం. ఇండ్లల్లో తప్పకుండా ఉండాల్సిన మొక్కల్లో కలబంద మొక్క కూడా ఒకటి. దీనిని బాహ్య అవసరాలకు, అంతర్గత సమస్యలను నయం చేయడంలో కూడా కలబందను ఉపయోగించవచ్చు. కలబందను ఉపయోగించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. పైన తెలిపిన మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల తరచూ వైద్యుని వద్దకు వెళ్లే పని లేకుండా మనకు వచ్చే అనారోగ్య సమస్యలను మనం ఇంట్లోనే నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.