Palak Paneer : మనకు అందుబాటులో ఉండే అత్యంత చవకైన ఆకు కూరల్లో పాలకూర ఒకటి. దీన్ని చాలా మంది తరచూ వండుతుంటారు. దీంతో టమాటా, కూర, పప్పు వంటివి చేస్తుంటారు. అయితే పాలకూరతో మనం అనేక విధాలైన ప్రయోజనాలను పొందవచ్చు. దీన్ని ఎలా వండి తిన్నా సరే మనకు అనేక లాభాలు కలుగుతాయి. అయితే పాలకూరను పనీర్ తో కూడా కలిపి వండుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ పనీర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలకూర – 2 కప్పులు, పనీర్ – 2 కప్పులు, టమాటా పేస్ట్ – అర కప్పు, ఉల్లిపాయల తరుగు – ఒక కప్పు, పచ్చి మిర్చి – 2, బటర్ – 25 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీస్పూన్, సోంపు – 1 టీస్పూన్, యాలకులు – 2, జీడిపప్పు – 10 గ్రాములు, లవంగాలు – 2, దాల్చిన చెక్క – చిన్న ముక్క, జీలకర్ర – చిటికెడు, చక్కెర – 1 టీస్పూన్, కారం – ఒక టీస్పూన్, ఉప్పు – ఒక టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, గరం మసాలా – 1 టీస్పూన్, నీళ్లు – పావు కప్పు, క్రీమ్ – 2 టీస్పూన్లు.
పాలక్ పనీర్‌ను తయారు చేసే విధానం..
పాలకూర, పచ్చి మిర్చిని శుభ్రం చేసుకుని మిక్సీ జార్‌లో వేసి ప్యూరీని సిద్దం చేసుకోవాలి. పనీర్ ని ముక్కలుగా కట్ చేసి వేడినీటిలో నాన పెట్టాలి. సోంపు, యాలకుల పొడి రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి బటర్ వేసి జీడి పప్పు దోరగా వేయించి పక్కన పెట్టాలి. దానిలో జీలకర్ర, చెక్క, లవంగాలు వేసి వేగాక ఉల్లిపాయ తరుగు, ఉప్పు వేసి మెత్తబడేవరకు వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. తరువాత పనీర్ ముక్కలు, పాలకూర ప్యూరీ, పసుపు, కారం, గరం మసాలా, సోంపు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నీళ్ళు పోసి 10 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. అంతే వేడి వేడి పాలక్ పనీర్ కూర రెడీ అవుతుంది. దీన్ని చపాతీలతో తింటే రుచి అదిరిపోతుంది.