Uttanpadasana : ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి తోడు ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్‌తోపాటు అజీర్ణం, మలబద్దకం, కడుపులో మంట అనేక సమస్యలు కూడా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ సమస్యలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన, మందులను వాడడం, సరైన సమయానికి భోజనం చేయకపోవడం, అధికంగా తినడం.. వంటి వాటిని గ్యాస్ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. వేళకు భోజనం చేయడంతోపాటు మితంగా ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, సరైన టైముకు నిద్రించడం, రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం.. వంటి జాగ్రత్తలను పాటించడం వల్ల గ్యాస్ సమస్య సులభంగానే తగ్గిపోతుంది.
అయితే గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గడంతోపాటు ఇతర జీర్ణ సమస్యలు కూడా పోవాలన్నా.. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడాలన్నా.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలన్నా.. పైన తెలిపిన జాగ్రత్తలను పాటించడంతోపాటు కింద చెప్పిన యోగా ఆసనం కూడా రోజూ వేయాలి. దీన్ని రోజుకు కనీసం 5 నిమిషాల పాటు వేయాలి. అలవాటు అయ్యాక రోజుకు సమయం 10 నిమిషాల వరకు పెంచుకోవచ్చు. ఈ ఆసనాన్ని వేయడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. దీన్ని ఎలా వేయాలి.. దీంతో ఇంకా ఏమేం ప్రయోజనాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్ సమస్యను తగ్గించి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరిచే ఈ ఆసనాన్ని ఉత్థాన పాదాసనం అంటారు. దీన్ని సులభంగానే ఎవరైనా సరే వేయవచ్చు. కానీ ఆపరేషన్ అయిన వారు.. వెన్ను నొప్పి ఉన్నవారు వేయరాదు. ఇక ఈ ఆసనాన్ని ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం.
నేలపై వెల్లకిలా పడుకోవాలి. కాళ్లను రెండింటినీ దగ్గరగా ఉంచాలి. తరువాత ఒక కాలుని నెమ్మదిగా పైకి ఎత్తాలి. దాన్ని గాల్లో అలాగే ఉంచాలి. తరువాత ఇంకో కాలుని కూడా పైకి ఎత్తాలి. ఇలా రెండు కాళ్లను పైకి ఎత్తిన తరువాత ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. తరువాత ఒక్కో కాలుని నెమ్మదిగా మళ్లీ కింద పెట్టాలి. ఇలా ఈ ఆసనాన్ని వేయాలి. 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఎన్ని సార్లు అయినా ఈ ఆసనాన్ని వేయవచ్చు. సౌకర్యాన్ని బట్టి సమయం కూడా పెంచవచ్చు. ఈ ఆసనాన్ని వేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడి గ్యాస్ సమస్య తగ్గుతుంది. మలబద్దకం అన్నది ఉండదు. కడుపులో మంట తగ్గిపోతుంది. ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. షుగర్ ఉన్నవారికి మేలు చేస్తుంది. పొట్ట, తొడలు, కాళ్ల కండరాలు దృఢంగా మారుతాయి. కనుక ఈ ఆసనాన్ని రోజూ వేసి.. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.