Balli Sastram : హిందువులు ఎంతో పురాతన కాలం నుంచి అనేక శాస్త్రాలు, పురాణాలను విశ్వసిస్తూ వస్తున్నారు. వాటిల్లో బల్లి శాస్త్రం కూడా ఒకటి. శరీరంపై పలు ప్రదేశాల్లో బల్లి పడితే భిన్న రకాల ఫలితాలు ఉంటాయని ఆ శాస్త్రం చెబుతోంది. బల్లి ఒంటిపై పడడం అరిష్టమని.. అందుకు ఏం చేయాల్సి ఉంటుంది.. అన్న వివరాలను కూడా ఆ శాస్త్రంలో పొందుపరిచారు. అయితే శరీరంపై ఏయే భాగాల్లో బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలు లేదా పెళ్లి కానివారిపై బల్లి పడితే ఆ ఫలితం వారి తల్లిదండ్రులకు ఉంటుంది. బల్లి తలపై పడి కాళ్ల వరకు పాకితే అంతా నష్టమే జరగబోతుందని అర్థం. అన్నీ కష్టాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అదే బల్లి పాదంపై పడి తల వరకు పాకితే అప్పుడు కీర్తి ప్రఖ్యాతులు పెరుగుతాయని, ధనం బాగా సంపాదిస్తారని, ఆయురారోగ్యాలు కలుగుతాయని అర్థం చేసుకోవాలి. బల్లి పాదాలపై పడితే వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. కుడి అరికాలుపై పడితే ప్రయాణం చేస్తారు. ఎడమ అరికాలుపై పడితే ధనం లభిస్తుంది. మడమల వెనుక భాగంలో బల్లి పడితే జైలును సందర్శిస్తారు. పాదాల సందుల్లో బల్లి పడితే రోగాలు వస్తాయి.
పాదాల వెనుక బల్లి పడితే సుఖ సంతోషాలు లభిస్తాయి. కాలివేళ్లపై బల్లి పడితే సంతానానికి హాని జరుగుతుంది. కుడి పాదంపై వేళ్ల మీద లేదా గోళ్ల మధ్యలో పడితే సిరి సంపదలు వస్తాయి. గోళ్ల మీద బల్లి పడితే హాని కలుగుతుంది. పాదాలకు ఎడమ వైపు కింది భాగంలో బల్లి పడితే నష్టాలు వస్తాయి. కుడివైపు పై భాగంలో బల్లి పడితే ధనలాభం ఉంటుంది. అదే మధ్యలో పడితే హాని కలుగుతుంది. కుడి పిక్క మీద బల్లి పడితే లాభం కలుగుతుంది. ఎడమ పిక్క అయితే నష్టం వస్తుంది. అదే మోకాళ్లు అయితే జయం కలుగుతుంది. తొడకు వెనుక బల్లి పడితే విష భయం, తొడకు ముందు భాగంలో పడితే సుఖం, తొడకు లోపలి భాగంలో పడితే స్త్రీ సౌఖ్యం కలుగుతుంది.
కుడి తొడపై బల్లి పడితే సంతాన హాని కలుగుతుంది. రెండు తొడల మీద బల్లి పడితే సంతానానికి లాభం కలుగుతుంది. తొడల మొదట బల్లి పడితే నీరసం వస్తుంది. బలం పోతుంది. గజ్జల్లో బల్లి పడితే అనారోగ్యం సంభవిస్తుంది. కుడి మోకాలుపై అయితే కీడు కలుగుతుంది. వృషణాలపై పడితే దాంపత్య హాని కలుగుతుంది. కుడి పిరుదు మీద సౌఖ్యం, ఎడమ పిరుదు మీద పడితే ధన లాభం కలుగుతాయి. శిశ్నంపై బల్లి పడితే సంతానం కలుగుతుంది. ధనం, ధాన్యం ప్రాప్తిస్తాయి. లింగం మొదట బల్లి పడితే దాంపత్య సుఖం ఉండదు. మర్మావయవాల రోమాలపై బల్లి పడితే దేశం విడిచి వెళ్తారు. కటి (మొల) ప్రదేశంలో బల్లి పడితే సంతాన లాభం కలుగుతుంది. పొట్టపై బల్లి పడితే ధనం వస్తుంది. నాభిపై అయితే స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. కుడి భుజంపై అయితే వ్యసనాలకు బానిసలవుతారు.
ఎడమ భుజంపై బల్లి పడితే ప్రజాదరణ పొందుతారు. మెడ వెనుక వైపు బల్లి పడితే కీడు కలగబోతుందని అర్థం చేసుకోవాలి. కంఠంపై బల్లి పడితే బంధువులు వస్తారు. రొమ్ముపై బల్లి పడితే అమితానందం పొందుతారు. సౌఖ్యం లభిస్తుంది. ఒకేసారి రెండు పెదవులపై బల్లి పడితే మరణం సంభవిస్తుంది. వీపుకు ఎడమ వైపు అయితే జయం కలుగుతుంది. వీపుకు కుడి వైపున బల్లి పడితే రాజభీతి ఉంటుంది. చేతిపై బల్లి పడితే డబ్బు అంతా పోతుంది. చేతి మణికట్టుపై పడితే అలంకరణ ప్రాప్తి కలుగుతుంది. నడుముకు మధ్యన బల్లి పడితే ధన లాభం కలుగుతుంది. భుజాల మీద బల్లి పడితే మరణం సంభవిస్తుంది.
పక్కటెముకలపై, నడుము కుడి భాగంపై బల్లి పడితే సోదర సోదరీమణులకు హాని కలుగుతుంది. నడుముకు ఎడమ వైపున బల్లి పడితే తల్లిదండ్రులకు పీడ కలుగుతుంది. ఎడమ అరచేతిలో బల్లి పడితే కష్టాలు వస్తాయి. వేళ్ల మీద బల్లి పడితే ఆపదలు వస్తాయి. కుడి వేళ్ల మధ్యన, ఎడమ చేతి గోళ్ల మీద బల్లి పడితే ధన లాభం కలుగుతుంది. కుడిచేత గోళ్ల మీద పడితే వ్యవహారాల్లో చిక్కులు వస్తాయి. కుడి మోచేయి పైభాగంపై బల్లి పడితే శతృ నాశనం జరుగుతుంది. కుడి అరచేతిలో బల్లి పడితే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. చేతి మొదట్లో అయితే ధనధాన్యాలు, కీర్తి ప్రాప్తి చెందుతాయి. మోచేతులపై బల్లి పడితే విచారిస్తారు. మణిపూస మీద పడితే ధనవంతులు అవుతారు. పొట్ట మడతలపై పడితే సోదరీమణులకు కీడు కలుగుతుంది. ఎడమ చేతిపై బల్లి పడితే స్త్రీ సుఖం లభిస్తుంది.
రొమ్ము మధ్య పీడ, రొమ్ముల మీద అయితే శుభం, పై పెదవి మీద అయితే రాజ్య లాభం, కింది పెదవి మీద అయితే విందు భోజనం, నాలకుపై విద్యాలాభం, గడ్డం వెంట్రుకలపై అయితే చెరసాల ప్రాప్తి, గొంతుక మీద అయితే భాగ్యం, గొంతు ఎముక అయితే సంకటం, మీసం మీద అయితే అధిక లాభం, మీసములకు ఎడమ వైపు అయితే కీడు, మీసములకు కుడి వైపు అయితే జయం, చంకలో అయితే భూత గ్రహ పీడ, వెన్ను మీదయితే శతృ బాధ, పిశాచ బాధ, మెడపై అయితే బుద్ధి నాశనం, భుజాలపై అయితే శతృ నాశనం, ఎడమ భుజం అయితు కీడు, కంఠం ఎడమ పక్క అయితే రోగం, మెడకు ఎడమ పక్క అయితే వాహన ప్రాప్తి, దంతాలపై అయితే అవమానం.. వంటి ఫలితాలు బల్లి పడడం వల్ల కలుగుతాయి.
ఇక గుండె మీద అయితే అధైర్యం, కనుబొమ్మల చివర అయితే శుభం, కనుబొమ్మల ఎడమ భాగంపై అయితే అవమానం, కనుబొమ్మల మధ్య అయితే వ్యాపారాభివృద్ధి, చెంప మీద అయితే శుభం, పురుషులకు ఎడమ చెంప, స్త్రీలకు కుడి చెంప అయితే హాని, స్త్రీలకు ఎడమ చెంప, పురుషులకు కుడి చెంప అయితే మేలు, స్త్రీలకు కుడి కంటపై పడితే కష్టం, స్త్రీలకు ఎడమ కంటిపై పడితే శుభం, నుదుటిపై అయితే బంధు సన్మానం, ముక్కుపై పడితే ఆలస్యంగా సుఖం వంటి ఫలితాలు కలుగుతాయి. బల్లి ముక్క చివర్లపై పడితే కష్టాలు, ముఖంపై అయితే కార్యానుకూలత విజయం, ధన లాభం, జుట్టు ముడి మీద అయితే రోగం, మగవారికి కుడి కంటిపై, కుడి చెవిపై పడితే మిక్కిలి లాభం, స్త్రీలకు ఎడమ చెవిపై అయితే సంపద, ముక్కుకు మధ్యన బల్లి పడితే శుభం, ముక్కుకు పక్కన పడితే మిత్ర లాభం వంటి ఫలితాలు ఉంటాయి.
ముక్కు కొనపై బల్లి పడితే పీడ వస్తుంది. జడ మీద అయితే భర్తకు హాని కలుగుతుంది. స్త్రీలకు నొసటి మీద అయితే ధన లాభం, స్త్రీలకు శిరస్సుపై లేదా ముంగురులపై అయితే ఆపదలు, స్త్రీలకు జారుముడి మీద అయితే మేలు, స్త్రీలకు తల ముసుగు మీద బల్లి పడితే మిక్కిలి కీడు, స్త్రీలకు చెవి దగ్గర చెంప మీద అయితే శుభం, పురుషులకు నొసటి మీద అయితే ఉద్యోగాభివృద్ధి, కీర్తి, సంపద, బంధువుల ఆదరణ, నడి నెత్తి మీద అయితే రోగం, కుడి కణతలపై అయితే సోదర సోదరీమణులకు కీడు, పురుషులకు కుడి పక్కన బల్లి పడితే శుభం వంటి ఫలితాలు కలుగుతాయి.
తలమీద బల్లి పడితే మేనమామకు కీడు సంభవిస్తుంది. తల వెంట్రుకల చివర బల్లి పడితే 14 మాసాల్లో మరణిస్తారట. అయితే దేహంపై బల్లి ఎప్పుడు, ఎక్కడ పడినా వెంటనే తలస్నానం చేయాలి. తరువాత ఇష్ట దైవానికి పూజలు చేయాలి. దీంతో బల్లి శాస్త్రం ప్రభావం ఉండదని చెబుతున్నారు. అలాగే బంగారు బల్లి, వెండి బల్లిని దర్శించి వాటిని స్పృశించిన వారిపై కూడా బల్లి శాస్త్రం ప్రభావం ఉండదని.. పండితులు చెబుతున్నారు.