Corn Salad : మొక్కజొన్నలు అంటే చాలా మందికి ఇష్టమే. మొక్కజొన్న కంకులను చాలా మంది నిప్పులపై కాల్చి తింటుంటారు. అలాగే కంకులను ఉడకబెట్టి విత్తనాలను కూడా తింటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బయట కూడా స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి గింజల రూపంలో విక్రయిస్తుంటారు. అయితే మొక్కజొన్న కంకులు మనకు సీజన్‌లోనే లభించినప్పటికీ స్వీట్ కార్న్ మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇక మొక్కజొన్న విత్తనాలను ఉపయోగించి మనం ఎంతో రుచికరమైన సలాడ్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు.. అందరికీ నచ్చుతుంది. సాయంత్రం సమయంలో దీన్ని చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే మొక్కజొన్న పచ్చి మిర్చి సలాడ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్కజొన్న పచ్చి మిర్చి సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మొక్కజొన్న గింజలు – 1 కప్పు, పచ్చి మిర్చి – 4, వెన్న లేదా నెయ్యి – 2 టీస్పూన్లు, చక్కెర – 1 టీస్పూన్.
మొక్కజొన్న పచ్చి మిర్చి సలాడ్‌ను తయారు చేసే విధానం..
మొక్కజొన్న గింజలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులో వెన్న లేదా నెయ్యి వేసి కరిగించాలి. వెన్న కరిగిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్న గింజలను వేయాలి. వీటిని బాగా వేయించాలి. తరువాత పచ్చి మిర్చిని సన్నగా తరిగి వేయాలి. వీటిని కూడా బాగా కలపాలి. ఇవి వేగుతుండగానే చక్కెర వేయాలి. చక్కెరను వేసి అన్నింటినీ బాగా కలిపి మళ్లీ వేయించాలి. సన్నని మంటపై 5 నిమిషాల పాటు వేయించాలి. చక్కెర పూర్తిగా కరిగిన తరువాత బాగా కలుపుతూ అన్నీ బాగా వేగాయి అనుకున్న తరువాత స్టవ్‌ను ఆఫ్ చేయాలి.
అనంతరం సలాడ్‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. ఎంతో రుచిగా ఉంటుంది. అయితే సలాడ్‌పై అవసరం అనుకుంటే కొత్తిమీర చల్లి కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు. లేదా తియ్యగా కావాలంటే కాస్త క్రీమ్ వేసి కలుపుకోవచ్చు. ఇలా తింటే ఈ సలాడ్ ఎంతో రుచిగా ఉంటుంది. సాయంత్రం సమయంలో నూనె పదార్థాలను తినేందుకు బదులుగా ఇలా సలాడ్‌ను చేసుకుని తింటే రుచికి రుచి పోషకాలకు పోషకాలు.. రెండింటినీ పొందవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చుతుంది.