Winter Health Tips : చలికాలం మరింత ముందుకు సాగింది. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా మంచు దుప్పట్లు కప్పుకుంటున్నాయి. చలి ధాటికి తాళలేక ప్రజలు అల్లాడుతున్నారు. వెచ్చగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే కింద తెలిపిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల తీవ్రమైన చలి నుంచి కూడా రక్షణ పొందవచ్చు. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక చలి బారి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. రాత్రి ఎక్కువగా పగలు తక్కువగా ఉంటుంది. అయితే మనం ధరించే దుస్తుల విషయంలో మాత్రం మార్పులు చేసుకోవాలి. పలుచని దుస్తులను ధరిస్తే.. రెండేసి చొప్పున ధరించాలి. అలాగే ఉన్నితో తయారు చేసిన స్వెటర్లు, మంకీ క్యాప్స్, స్కార్ప్‌లు, చేతులకు గ్లోవ్స్, కాళ్లకు సాక్స్ వంటివి ధరించాలి. ఇవి మనల్ని వెచ్చగా ఉంచుతాయి. చలి బారి నుంచి చర్మాన్ని సంరక్షిస్తాయి. కనుక ఈ సీజన్‌లో మనం ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ఇక దీంతోపాటు శరీరాన్ని పొడిగా ఉంచుకోవాలి. పొడిగా ఉండే దుస్తులనే ధరించాలి. తడి ఎక్కువ సేపు ఉండకూడదు. దుస్తులు తడిగా ఉంటే మనం తీవ్రమైన చలిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే శరీరం తడిగా ఉన్నా కూడా చలిగా అనిపిస్తుంది. కనుక శరీరం పొడిగా ఉండడంతోపాటు దుస్తులు కూడా పొడిగా ఉండేలా చూసుకోవాలి.
ఇక ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి కనుక సాయంత్రం నుంచి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయాలి. బయటకు రాకూడదు. మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్లకూడదు. అలాగే ఇంటి లోపలి ప్రదేశాలు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అందుకు గాను కిటికీలు, తలుపులను మూసేయాలి. అలాగే రూమ్ హీటర్లను ఉపయోగించడం వల్ల కూడా వెచ్చగా ఉండవచ్చు. ఇక చలికాలంలో మనకు దాహం అవదు. కానీ తప్పనిసరిగా రోజుకు కావల్సిన మోతాదులో నీళ్లను తాగాలి. దీని వల్ల శరీరానికి కావల్సిన ద్రవాలు అందుతాయి. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడతాయి.
చలికాలంలోనూ మనం తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తలు వహించాలి. వేడిగా ఉండే ఆహారాలనే తినాలి. అయితే చాలా మంది వెచ్చగా ఉంటాయి అని చెప్పి వేడి పదార్థాలను తీసుకుంటుంటారు. ముఖ్యంగా మద్యం సేవించడంతోపాటు టీ, కాఫీలను అధికంగా తాగుతారు. ఇలా చేయరాదు. వీటితో దుష్పరిణామాలు ఎదురవుతాయి. వీటికి బదులుగా కషాయాలు, హెర్బల్ టీ లను తాగవచ్చు. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. ఇలా పలు జాగ్రత్తలను పాటించడం వల్ల చలికాలంలో వెచ్చగా ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.