Mutton Keema Masala Curry : నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఆహారాల్లో మటన్ కూడా ఒకటి. మటన్‌తో అనేక రకాల వెరైటీలను చేసుకోవచ్చు. మటన్ కర్రీ, వేపుడు, బిర్యానీ.. ఇలా అనేక రకాలుగా మటన్‌ను వండుకోవచ్చు. అయితే మటన్‌ను తినడం, జీర్ణించుకోవడం కొందరికి కష్టంగా ఉంటుంది. అందుకని వారు మటన్‌ను తినేందుకు ఇష్టపడరు. అయితే మటన్ కీమాను తినవచ్చు. ఇది సులభంగా ఉడుకుతుంది. అలాగే రుచిగా ఉంటుంది. సులభంగా తినవచ్చు. త్వరగా జీర్ణమవుతుంది. ఇక మటన్ కీమాను మసాలా కూర రూపంలో వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. మటన్ కీమా మసాలా కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ కీమా మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ కీమా – పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క – 2 ముక్కలు, లవంగాలు – 2, ఆకుపచ్చ యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1, ఉల్లిపాయలు (తరిగినవి) – 1 కప్పు, పచ్చి మిర్చి – 3 (కారం అవసరం అనుకుంటే ఇంకో 2 వేసుకోవచ్చు), కరివేపాకులు – 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, టమాటాలు – 1 కప్పు, ఉప్పు – ఒకటింపావు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టేబుల్ స్పూన్, కారం – 1 టేబుల్ స్పూన్, నీళ్లు – 1 గ్లాస్, ధనియాల పొడి – అర టేబుల్ స్పూన్, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు.
మటన్ కీమా మసాలా కూరను తయారు చేసే విధానం..
అడుగు భాగం మందంగా ఉండే ఒక గిన్నె లేదా ప్రెషర్ కుక్కర్‌ను తీసుకుని నూనె వేసి వేడి చేయాలి. అనంతరం అందులో దాల్చిన చెక్క ముక్కలు, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చి మిర్చిలను ఒకదాని తరువాత ఒకటి వరుసగా వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మగ్గనివ్వాలి. పచ్చి వాసన పోయే వరకు అన్నింటినీ వేయించాక టమాలు, కీమా వేయాలి. అనంతరం అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత మూత పెట్టి నీళ్లు బయటకు వచ్చే వరకు ఉడికించాలి. ఇదే సమయంలో కీమా ఎంత మేర ఉడికిందో తెలిసిపోతుంది.
కీమా ఉన్న పరిమాణాన్ని బట్టి నీళ్లను పోయాలి. తరువాత కారం వేయాలి. ఇంకా ఏమైనా పదార్థాలు మిగిలి ఉంటే అవి కూడా వేయాలి. తరువాత కుక్కర్‌లో అయితే మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అయితే కీమా ఉడకకపోతే ఇంకో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. కీమా ఉడికిన తరువాత ధనియాల పొడి చల్లాలి. బాగా కలపాలి. అనంతరం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మటన్ కీమా మసాలా కూర రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా రోటీల్లో తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.