Tiffin Sambar : మనకు హోటల్స్ లో అల్పాహారాలను తినడానికి చట్నీలతో పాటు సాంబార్ ను కూడా ఇస్తూ ఉంటారు. టిఫిన్ తినడానికి ఇచ్చే ఈ సాంబార్ చిక్కగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది సాంబార్ తో టిఫిన్స్ ను తినడానికి ఇష్టపడతారు. ఈ హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సాంబార్ ను తయారు చేయడం చాలా తేలిక. ఇంట్లోనే హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ ను రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టిఫిన్ సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – పావు కప్పు, పొడుగ్గా తరిగిన టమాట – 1, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, నీళ్లు – ఒకటిన్నర కప్పు, నూనె – 2 టీస్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, చింతపండు – ఒక నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – 5, మెంతులు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఇంగువ – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, సాంబార్ ఉల్లిపాయలు – పావు కప్పు, సాంబార్ పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా.
టిఫిన్ సాంబార్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో టమాట, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి. తరువాత దీనిని మధ్యస్థ మంటపై 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మూత తీసి ఈ పప్పును నీటితో సహా జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో మెంతులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని పొడిగా చేసి పక్కకు ఉంచాలి.ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చిటికెడు మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఇప్పుడు సాంబార్ పొడి, మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసి కలపాలి. తరువాత 3నుండి 4 కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఈ సాంబార్ ను మధ్యస్థ మంటపై 6 నుండి 7 నిమిషాల పాటు మరిగించిన తరువాత మెంతులు, జీలకర్ర పొడిని వేసి కలపాలి. దీనిని మరో 6 నిమిషాల పాటు మరిగించిన తరువాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టిఫిన్ సాంబార్ తయారవుతుంది. దీనిని ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా సులభంగా ఇంట్లోనే హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ ను తయారు చేసుకుని తినవచ్చు.