చూడడానికి ఎర్రగా నిగనిగలాడుతూ రుచికరంగా ఉండే టమాటాల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగుంటాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి, కంటి ఆరోగ్యానికి, రక్తాన్ని శుభ్ర పరచడానికి.. ఇలా టమాటాల వల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు ఎన్నో.. ఎన్నెన్నో.. ఈ క్రమంలో టమాటాల్లో దాగున్న పోషకాలు, అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి ? మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం.
1. క్యాలరీలు తక్కువగా ఉండే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. అలాగే కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఆహారంగా తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణుల అభిప్రాయం.
2. అధిక బరువును తగ్గించుకోవడంలో భాగంగా వ్యాయామం, డైటింగ్ మొదలైనవి చేస్తున్నారా ? అయితే మీరు మరో పని కూడా చేయాలి. ఏంటదంటారా ? ఏం లేదండి.. ప్రతి రోజూ టమాటాలు తింటే సరిపోతుంది. బరువు తగ్గుతారు.
3. రొమ్ము, పెద్ద పేగు, ఊపిరితిత్తులు.. మొదలైన క్యాన్సర్లన్నింటి నుంచి రక్షణ కల్పించే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ టమాటాల్లో ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల టమాటాలను తరచూ తింటుండాలి. ఆయా అనారోగ్యాలను రాకుండా అడ్డుకోవచ్చు.
4. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. రేచీకటిని నిరోధించడానికైనా, కంటి చూపును మెరుగుపరుచుకోవడానికైనా విటమిన్ ఎ అధికంగా లభించే టమాటాల్ని తినడం శ్రేయస్కరం.
5. విటమిన్ ఎ వల్ల జుట్టు బలంగా మారుతుంది. మెరుస్తుంటుంది. రక్తం శుద్ధి చేయడంతోపాటు మూత్రాశయంలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా టమాటాలు కాపాడుతాయి. రక్తం బాగా తయారవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
6. టమాటాల్లో సోడియం, శాచురేటెడ్ కొవ్వులు తక్కువగా, ఎ, సి, కె విటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరానికెంతో అవసరమైన మెగ్నీషియం, ఫాస్ఫరన్, కాపర్, థయామిన్, నియాసిన్.. మొదలైన పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి టమాటాలను తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. పోషణ లభిస్తుంది.
7. టమాటాల్లో పీచు, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం రోజూ టమాటాల్ని తినడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
8. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడం చాలా ముఖ్యం. ఇది సాధ్యం కావాలంటే క్రోమియం ఎక్కువగా లభించే టమాటాల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. నిత్యం టమాటాలను తీసుకోవడం వల్ల క్రోమియం ఎక్కువగా లభిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తరచూ టమాటాలను తింటుండాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365