భారతీయుల వంట ఇళ్లలో అల్లం తప్పనిసరిగా ఉంటుంది. దీన్ని అనేక వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. అల్లం ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. అలాగే చక్కని వాసన వస్తుంది. దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అల్లాన్ని పురాతన కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. దీని వల్ల జలుబు, ఫ్లూ, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఫ్లూ, తలనొప్పి వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే మ్యూకస్ (శ్లేష్మం) క్లియర్ అవుతుంది. అందువల్ల అల్లంను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలి. అల్లంను ఈ సీజన్‌లో తీసుకుంటే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. ఈ క్రమంలోనే అల్లంను టీ, ఇతర డ్రింక్స్, ఆహారాలు, చట్నీల్లో ఎక్కువగా ఉపయోగించాలి.
అయితే అల్లం పాలను కూడా తయారు చేసుకుని తాగవచ్చు. దీంతో మనకు పైన తెలిపిన లాభాలు అన్నీ కలుగుతాయి. ఈ క్రమంలోనే అల్లం పాలను ఎలా తయారు చేయాలో, అందుకు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం పాలు తయారీకి కావల్సిన పదార్థాలు:
* పాలు – 1 కప్పు
* తురిమిన అల్లం – 1 టీస్పూన్
* నల్ల మిరియాల పొడి – చిటికెడు
* దాల్చిన చెక్క పొడి – చిటికెడు
* బెల్లం – తగినంత (రుచి కోసం)
అల్లం పాలను తయారు చేసే విధానం:
ఒక పాత్రలో పాలను తీసుకుని అందులో తురిమిన అల్లం వేసి 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం అందులో నల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేయాలి. తరువాత స్టవ్ ఆర్పి పాత్రను దించుకోవాలి. అనంతరం అందులో బెల్లం పొడి వేసి బాగా కలపాలి. అవసరం అనుకుంటే అందులో డ్రై ఫ్రూట్స్ లేదా కుంకుమ పువ్వును కలుపుకోవచ్చు. దీంతో పాలు రుచిగా ఉంటాయి. ఇక అలా తయారైన అల్లం పాలను గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
* పాలు, అల్లం రెండూ పోషక పదార్థాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. అందువల్ల ఈ రెండింటి కాంబినేషన్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
* అల్లంలో ఉండే థర్మోజెనిక్ గుణాలు చలికాలంలో మనల్ని వెచ్చగా ఉంచుతాయి.
* అల్లంలో ఉండే యాంటీ వైరల్ గుణాలు మనకు సీజనల్ వ్యాధులు రాకుండా రక్షిస్తాయి.
* శీతాకాలంలో సహజంగానే మన జీర్ణ క్రియ మందగిస్తుంది. దాన్ని నివారించాలన్నా, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలన్నా అల్లం మనకు ఎంతగానో మేలు చేస్తుంది.
* అల్లం, పాలు రెండింటినీ కలిపి తాగడం వల్ల లభించే పోషకాలు మనల్ని ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉంచుతాయి.