Onion Egg Rice : మనం రైస్ తో రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా, రుచిగా చేసుకోదగిన రైస్ వెరైటీలలో ఆనియన్ ఎగ్ రైస్ కూడా ఒకటి. ఉల్లిపాయలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, లంచ్ బాక్స్ లోకి అలాగే నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ ఎగ్ రైస్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియన్ ఎగ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ ఎగ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, ఉడికించిన కోడిగుడ్లు – 4, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 1, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 3, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, సన్నగా పొడవుగా తరిగిన క్యారెట్ – అర కప్పు, ధనియాల పొడి – అర టీ స్పూన్, అన్నం – ఒక కప్పు బియ్యంతో వండినంత.
ఆనియన్ ఎగ్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత ఉడికించిన కోడిగుడ్లు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత క్యారెట్ ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి వీటిని మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి. తరువాత వేయించిన గుడ్లు వేసి కలపాలి. తరువాత అన్నం వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ ఎగ్ రైస్ తయారవుతుంది. ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.