Egg Shells : సాధారణంగా కోడిగుడ్లను ఉపయోగించిన తరువాత ఎవరైనా సరే ఏం చేస్తారు..? పెంకులను పడేస్తారు. అంతే కదా. అయితే వాస్తవానికి కోడిగుడ్డు పెంకులతోనూ మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటిల్లో ఇప్పుడు చెప్పబోయేది కూడా ఒకటి. ఈ పెంకులతో మనం క్లీనింగ్ పొడిని తయారు చేయవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఈ పెంకులను ఉపయోగించి క్లీనింగ్ పొడి తయారు చేసి దాంతో వంట పాత్రలను శుభ్రం చేయవచ్చు. ఇక ఈ పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కోడిగుడ్డు పెంకులను నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. అనంతరం వాటిని ఆరబెట్టి ఓవెన్ లో ఉంచి పొడిగా అయ్యేలా చేయాలి. అయితే ఓవెన్ లేని వారు ఎండలో కూడా వీటిని ఆరబెట్టి పొడిగా చేయవచ్చు. అనంతరం వాటిని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేయాలి. తరువాత అందులోనే వాషింగ్ పౌడర్, బేకింగ్ సోడాను వరుసగా వేస్తూ మెత్తని పొడిలా పట్టుకోవాలి. పొడి బాగా మెత్తగా అయ్యాక దాన్ని ఉపయోగించవచ్చు.
ఇలా తయారు చేసిన పొడిని ఉపయోగించి మీరు వంట పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా కోడిగుడ్డు పెంకులను పడేయకుండా వాటిని ఉపయోగించుకోవచ్చు. అయితే వీటిని మొక్కలకు ఎరువుగా కూడా వేయవచ్చు. వీటిని చిన్న ముక్కలుగా చేసి కుండీల్లో మొక్కల పాదుల వద్ద వేయాలి. దీంతో కోడిగుడ్డు పెంకుల్లో ఉండే పోషకాలు మొక్కలకు లభిస్తాయి. దీని వల్ల మొక్కలు చక్కగా పెరుగుతాయి. పూల మొక్కలు అయితే పూలు బాగా పూస్తాయి. ఇలా కోడిగుడ్డు పెంకులను మనం వాడుకోవచ్చు.