Naatu Kodi : ప్రస్తుత తరుణంలో బ్రాయిలర్ కోళ్ల కన్నా నాటుకోళ్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకనే ఎక్కడ చూసినా నాటుకోళ్లను అమ్మే విక్రయశాలలు మనకు రహదారుల పక్కన కనిపిస్తున్నాయి. ఇక కొన్నిచోట్ల అయితే మనకు కావల్సిన నాటుకోడిని కొంటే వారే వండి మరీ అందిస్తున్నారు. దీంతో ఇలాంటి భోజనశాలలకు సైతం గిరాకీ పెరిగింది. నాటుకోళ్లను తినాలని చాలా మంది భోజన ప్రియులు ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకనే ఈ కోళ్లకు రేటు కూడా పెరుగుతోంది.
నాటుకోళ్లను మనం కొనుగోలు చేస్తే విక్రయదారులే వాటిని వండి మనకు అన్నంతో సహా అందిస్తారు. అలాంటి భోజనశాలలు అనేక చోట్ల ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రాంతంలోని ఆర్మూర్‌లో అయితే ఇలాంటి మెస్‌లు చాలా ఫేమస్. ఈ క్రమంలో ఒక నాటు కోడిని కొంటే వండి ఇచ్చేందుకు మొత్తం కలిపి గతంలో రూ.650 తీసుకునేవారు. కానీ ఇప్పుడు రూ.900 వసూలు చేస్తున్నారు. అయినా సరే చికెన్ ప్రియులు మాత్రం ఎంత రేటైనా సరే పెట్టి నాటుకోళ్లను కొని మరీ వండించి తింటున్నారు.
Naatu Kodi : రూ.600 వరకు కిలో..
సాధారణంగా నాటుకోళ్లు గతంలో రూ.300 వరకు కిలో ధర ఉండేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.400 నుంచి రూ.500 వరకు.. కొన్ని చోట్ల రూ.600 వరకు కిలోకు పలుకుతోంది. అందువల్లే మెస్‌లలో ఒక కిలో నాటుకోడిని వండి అన్నంతో సహా అందించేందుకు నిర్వాహకులు రూ.900 మేర వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ భోజన ప్రియుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
ఇక నగరాలు, పట్టణాల్లో ఉన్నవారు సైతం నాటుకోళ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే లోకల్‌గా పెరిగిన కోళ్లను ఎంత ధరైనా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఫామ్‌లలోనూ నాటుకోళ్లను పెంచుతున్నారు. వీటి ధర కొంత తక్కువే. కానీ లోకల్ గా పెరిగిన కోళ్లు అయితే ఇంకా రుచికరంగా ఉంటాయని చెప్పి వాటినే కావాలని అడుగుతున్నారు. అందుకనే వాటి ధర కొండెక్కింది. కొన్ని చోట్ల అయితే మటన్‌కు సమానంగా నాటు కోళ్ల ధర ఉందని అంటున్నారు. ఏది ఏమైనా నాటుకోళ్ల వ్యాపారం మాత్రం విక్రయదారులకు కాసులు కురిపిస్తుందని చెప్పవచ్చు. కొంత శ్రమ, ఓపిక ఉండాలే గానీ ఈ వ్యాపారం చక్కని స్వయం ఉపాధి మార్గంగా మారుతుందని అంటున్నారు.