ప్రకృతిలో మనకు లభించే అత్యంత సహజసిద్ధమైన పానీయాల్లో నీరు ఒకటి. ఇది సమస్త ప్రాణికోటికి జీవనాధారం. నీరు లేనిదే ఏ జీవి బతకలేదు. మన శరరీంలో జరిగే అనేక మెటబాలిక్ చర్యలకు నీరు అత్యంత అవసరం అవుతుంది. నీటిని పానీయంగా కాదు, ఔషధంగా భావించి సేవించాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
పురుషులకు రోజుకు 3 లీటర్ల నీరు అవసరం అవుతుంది. స్త్రీలకు అయితే 2.2 లీటర్ల నీరు చాలు. అయితే ఇది కేవలం సగటు అంచనా మాత్రమే. నిజానికి రోజూ ఎవరికి ఎంత మొత్తంలో నీరు అవసరం అవుతుందో అంత మొత్తంలో తాగాలి. హెచ్చు తగ్గులు పనికిరావు. జీవక్రియలైన చెమటపట్టడం, ఉఛ్వాస నిశ్వాస క్రియలు, మూత్ర విసర్జన, పేగుల కదలికలు వంటి చర్యలకు నీరు అవసరం అవుతుంది. శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి మోతాదును మనం రోజూ భర్తీ చేయాలి. లేదంటే సమస్యలు వస్తాయి.
ఇక వ్యక్తులు వారు చేసే పని, నివసించే వాతావరణం, ఆరోగ్యం వంటి వాటిని బేరీజు వేసుకుని నీటిని తాగాలి. అలాగే వాంతులు, విరేచనాలు అయ్యేవారు, తరచూ డీహైడ్రేషన్ బారిన పడేవారు ఎక్కువగా నీటిని తాగాల్సి ఉంటుంది. దీంతో శరీరం కోల్పోయే నీరు, లవణాలు భర్తీ అవుతాయి. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
శరీరానికి నీరు కావాలంటే కేవలం నీటినే తాగాల్సిన పనిలేదు. మజ్జిగ, పాలు, పలుచని పండ్ల రసాలు, ఇతర పానీయాలు, నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు వంటి వాటిని కూడా తీసుకోవచ్చు. వాటి వల్ల కూడా శరీరానికి నీరు అందుతుంది.
ఇక నీటిని మోతాదుకు మించి తాగితే మూత్రపిండాలు శ్రమించాల్సి వస్తుంది. వాటిపై ఒత్తిడి అధికమవుతుంది. ఇది మంచిదికాదు. కనుక మోతాదులో మాత్రమే నీటిని తాగాలి. నీటిని ఎక్కువగా తాగితే రక్తంలోని సోడియం నిల్వలు కూడా పలుచబడతాయి. ఇది కూడా మంచిది కాదు. కాబట్టి నీటిని అవసరం ఉన్నంత మేర మాత్రమే తాగాల్సి ఉంటుంది. అలా అని చెప్పి అవసరం కన్నా తక్కువ నీటిని కూడా తాగరాదు. మోతాదులో తాగాలి.
నీటిని తగినంతగా తాగకపోతే రక్తప్రసరణ సాఫీగా జరగదు. మెదడు ఉత్తేజంగా ఉండదు. స్తబ్దుగా ఉంటుంది. ఏపని చేయాలన్నా బద్దకంగా అనిపిస్తుంది. అలసట ఎక్కువవుతుంది. నీరసం వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే నీటిని తక్కువగా తాగుతున్నట్లు గమనించాలి. వెంటనే నీటిని తాగితే ఈ లక్షణాల నుంచి బయట పడవచ్చు.
ఇక నీటిని తగినంత మోతాదులో తాగితే మూత్రం స్వచ్ఛంగా లేదా లేత పసుపు రంగులో వస్తుంది. ముదురు పసుపు, బంగారు రంగులో మూత్రం ఉంటే నీటిని తగినంతగా తాగడం లేదని తెలుసుకోవాలి.
వాకింగ్ చేసేవారు వాకింగ్ అనంతరం 2 గ్లాసుల నీటిని తాగాలి. భోజనం చేసేందుకు 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ నీటిని తాగితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. స్నానానికి ముందు ఒక గ్లాస్ నీటిని తాగితే బీపీ తగ్గుతుంది. నిద్రించేముందు ఒక గ్లాస్ నీటిని తాగితే హార్ట్ ఎటాక్స్ రావు. ఉదయాన్నే పరగడుపునే రెండు గ్లాసుల నీటిని తాగితే మూత్రపిండాలు శుభ్రమవుతాయి. మలినాలు బయటకు పోతాయి. ఆహారం తీసుకునేటప్పుడు నీటిని తాగరాదు. కనీసం 30 నిమిషాల విరామం ఉండాలి. లేదంటే జీర్ణ శక్తి నశిస్తుంది. ఇక వ్యాయామం చేయడానికి ముందు, తరువాత నీటిని తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది.
నిత్యం తగినంత మోతాదులో నీటిని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం ఉండదు. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనవచ్చు. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. రక్తం ద్వారా శరీర భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా సరఫరా అవుతుంది. కండరాలు దృఢంగా పనిచేస్తాయి. చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది.
తగినంత మోతాదులో నీటిని తాగితే చర్మం శుభ్రంగా మారుతుంది. స్వేద రంధ్రాలు తెరుచుకుంటాయి. చెమట బయటకు వెళ్తుంది. గుండెకు పోషకాలు సరిగ్గా అందుతాయి. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడవు. కీళ్లు ఆరోగ్యంగా పనిచేస్తాయి. నోటి దుర్వాసన ఉండదు. కండరాలు రిలాక్స్ అవుతాయి. శరీర భాగాల్లో ఉండే మలినాలు తొలగించబడతాయి. కనుక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మోతాదులో నీటిని తాగాలి. ఇక వేసవిలో కాస్త ఎక్కువ నీటినే తాగాలి. దీని వల్ల శరీరం కోల్పోయే ద్రవాలను భర్తీ చేయవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365