Chicken Pakodi : మనకు లభించే మాంసాహార ఉత్పత్తులల్లో చికెన్ ఒకటి. అమైనో యాసిడ్లు చికెన్ లో అధికంగా ఉంటాయి. చికెన్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. చికెన్ తో మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంటలల్లో చికెన్ పకోడి ఒకటి. చికెన్ పకోడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, మైదా పిండి (ఆల్ పర్పస్ ఫ్లోర్) – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, చికెన్ మసాలా – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – డీప్ ఫ్రై కు సరిపడినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 4, కరివేపాకు – 2 రెబ్బలు, నిమ్మరసం – అర టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా.
చికెన్ పకోడి తయారీ విధానం..
ముందుగా చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత మూత పెట్టి పది నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. 10 నిమిషాల తరువాత మైదా పిండి, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, కొద్దిగా నీటిని పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో డీప్ ఫ్రైడ్ కు సరిపడా నూనె పోసి కాగాక, చికెన్ ను పకోడిలా వేసి మధ్యస్థ మంటపై వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న చికెన్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చివరగా కరివేపాకు, పచ్చి మిర్చి వేసి వేయించి, ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ మీద వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడి తయారవుతుంది. టమాటా కెచప్ తో కలిపి చికెన్ పకోడిని తింటే చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ లతో కలిపి కూడా చికెన్ పకోడిని తీసుకోవచ్చు. లేదా నేరుగా కూడా తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.