Mutton Fry : మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లను, ఇతర పోషకాలను అందించే ఆహారాల్లో మటన్ ఒకటి. మాంసాహార ప్రియులకు దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ తో చేసే వంటకాలను తినడం వల్ల రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మటన్ తో మనం సులభంగా చేసుకోదగిన వంటకాల్లో మటన్ ఫ్రై ఒకటి. మటన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు, మొదటిసారి చేసే వారు ఇలా ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. అందరికి నచ్చేలా రుచిగా, తేలికగా మటన్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
అర గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన మటన్ – 500 గ్రాములు, నీళ్లు – 750 ఎమ్ ఎల్, నూనె – అర కప్పు, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 4, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ముప్పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
మటన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో మటన్ ను వేసుకోవాలి. తరువాత నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ మటన్ ను 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. తరువాత నీటిని వడకట్టి మటన్ ను పక్కకు ఉంచాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఐరన్ కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. తరువాత ఉడికించిన మటన్ ను వేసి కలపాలి. మటన్ లోని నీరంతా పోయి మటన్ దగ్గర పడే వరకు మధ్యస్థ మంటపై వేయించాలి.
మటన్ లోని నీరంతా పోయి నూనె పైకి తేలిన తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ ఫ్రై తయారవుతుంది. దీనిని చారు, రసం వాటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన మటన్ ఫ్రైను ఒక్క ముక్క విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.