Papaya Halwa : మనకు ఏడాది పొడవునా సీజన్లతో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ పడిపోతే బొప్పాయి పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. దీంతో ప్లేట్లెట్స్ మాత్రమే కాదు.. రక్తం కూడా బాగా తయారవుతుంది. ఇంకా బొప్పాయి పండును తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ పండ్లతో మనం ఎంతో రుచికరమైన హల్వాను కూడా తయారు చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
దోరగా పండిన బొప్పాయి తురుము – నాలుగు కప్పులు, నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు, చక్కెర – ఐదు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూన్, బాదం పొడి లేదా పాల పొడి లేదా కొబ్బరి పొడి – రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు.
బొప్పాయి హల్వాను తయారు చేసే విధానం..
బొప్పాయి పండును శుభ్రంగా కడిగి ముక్కలు చేసి గింజలు వేరు చేసి తురమాలి. బాణలిలో నెయ్యి వేసి కరిగాక బొప్పాయి తురుము వేసి సన్నని మంటపై సుమారు పావు గంట సేపు దోరగా వేయించాలి. బాగా ఉడికిన తరువాత చక్కెర వేసి బాగా కలిపి సుమారు పావు గంట సేపు ఉడికించాలి. బాదం పప్పుల పొడి జత చేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. జీడిపప్పు పలుకులు కూడా వేసి మళ్లీ రెండు నిమిషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో బాగా కలియబెట్టాలి. రెండు నిమిషాలయ్యాక స్టఫ్ ఆఫ్ చేయాలి. దీంతో ఎంతో రుచికరమైన బొప్పాయి హల్వా రెడీ అవుతుంది. దీన్ని చల్లగా లేదా వేడిగా ఎలాగైనా సరే తినవచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.