Ragi Puri : మనం అల్పాహారంగా తయారు చేసే వాటిల్లో పూరీలు కూడా ఒకటి. పూరీలను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. సాధారణంగా మనం పూరీలను తయారు చేసుకోవడానికి మైదాపిండిని లేదా పూరీ పిండిని ఉపయోగిస్తూ ఉంటాం. ఇలాంటి పిండితో చేసిన పూరీలను తినడం వల్ల మన ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. వీటికి బదులుగా మనం రాగిపిండితో కూడా పూరీలను తయారు చేసుకోవచ్చు. రాగిపిండితో చేసే పూరీలు రుచిగా ఉంటాయి. అలాగే రాగిపిండితో చేసే పూరీలను తినడం వల్ల శరీరానికి మరింత హాని కలగకుండా ఉంటుంది. రాగి పిండితో చక్కగా పొంగేలా పూరీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపిండి – ఒక కప్పు, గోధుమపిండి – ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నీళ్లు – ఒక కప్పు.
రాగి పూరీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. తరువాత అందులో గోధుమపిండి, ఉప్పు, బొంబాయి రవ్వ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. అలాగే పిండి మరీ మెత్తగా, మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి. తరువాత ఈ పిండిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత పిండిని మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి లేదా నూనె రాస్తూ మరీ పలుచగా కాకుండా పూరీని వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడైన తరువాత పూరీ వేసి కాల్చుకోవాలి.
ఈ పూరీని నూనెలో వేయగానే గంటెతో నొక్కి పట్టుకుంటే చక్కగా పొంగుతుంది. ఈ పూరీలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి పూరీ దోశ తయారవుతుంది. దీనిని బొంబాయి చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పిండితో ఇలా పూరీలే కాకుండా చపాతీలు కూడా తయారు చేసుకోవచ్చు. రాగి పిండితో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పూరీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.