Saggubiyyam Vadiyalu : మనం వేసవికాలంలో రకరకాల వడియాలను తయారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటాం. మనకు కావల్సినప్పుడు ఈ వడియాలను వేయించుకుని సైడ్ డిష్ గా తింటూ ఉంటాం. ఎవరైనా సులభంగా తయారు చేసుకోగలిగిన వివిధ రకాల వడియాలల్లో సగ్గు బియ్యం వడియాలు కూడా ఒకటి. ఈ వడియాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం చాలా తేలిక. చక్కగా పొంగేలా అలాగే రుచిగా ఉండేలా సగ్గుబియ్యంతో వడియాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యం వడియాల తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గు బియ్యం – ఒక కప్పు, నీళ్లు – 6 కప్పులు, పచ్చిమిర్చి – 5, జీలకర్ర – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, అల్లం – ఒక ఇంచు ముక్క.
సగ్గు బియ్యం వడియాల తయారీ విధానం..
ముందుగా సగ్గు బియ్యాన్ని కడిగి పది నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత జార్ లో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో నానబెట్టిన సగ్గుబియ్యం, నీళ్లు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తఇలా ఉడికించిన తరువాత మూత తీసి ఈ సగ్గుబియ్యం మిశ్రమానికి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడియాలుగా పెట్టుకోవాలి. వీటిని బాగా ఎండలో ఎండబెట్టి తరువాత జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం వడియాలు తయారవుతాయి. వీటిని నూనెలో వేసి వేయిస్తే చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ విధంగా చేయడం వల్ల వడియాలు చక్కగా పొంగుతాయి.