Sajja Rottelu : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పూర్వకాలంలో సజ్జలే ప్రధాన ఆహారంగా ఉండేవి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సజ్జల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడంలో ఎంతగానో సహాయపడతాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో కూడా ఇవి మనకు ఎంతో దోహదపడతాయి. సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కండరాలు బలంగా తయారవుతాయి. సజ్జలతో సంగటి, రొట్టెలు, గటక, అప్పాలు వంటి వాటిని తయారు చేస్తారు. సజ్జ రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సజ్జ రొట్టెలను తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరైనా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. సజ్జలతో రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత పిండి వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పిండిని చల్లారే వరకు ఉంచిన తరువాత చేతికి తడి చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి.
తరువాత తగిన పరిమాణంలో ఉండలు లేకుండా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని పొడి సజ్జ పిండి చల్లుకుంటూ చపాతీకర్రతో రొట్టెలా వత్తుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక రొట్టెను వేసుకోవాలి. తరువాత రొట్టెపై నీటితో తడి చేసుకోవాలి. తరువాత దీనిని రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ రొట్టెలు కాల్చుకోవడానికి సమయం ఎక్కువగా పడుతుంది. కనుక నిదానంగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సజ్జ రొట్టెలు తయారవుతాయి. వీటిని ఏ కూరతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా సజ్జ రొట్టెలను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.