Tomato Kaju Masala Curry : టమాట కాజు మసాలా కర్రీ.. మనకు రెస్టారెంట్ లలో, ధాబాలలో లభించే కూరలల్లో ఇది ఒకటి. జీడిపప్పు, టమాటాలు కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా దీనిని నాన్, రోటీ వంటి వాటితో కలిపి తింటూ ఉంటారు. అచ్చం అదే రుచితో ఈ కూరను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, మొదటి సారి చేసే వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా దీనిని తయారు చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ టమాట కాజు మసాలా కూరను మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కాజు మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, కరివేపాకు – 2 రెమ్మలు, ఎండుమిర్చి – 3, జీడిపప్పు పలుకులు – 75 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పెద్ద టమాటాలు – 2, తరిగిన టమాటాలు – 3, , జీడిపప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – పావు లీటర్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్.
టమాట కాజు మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని 70 శాతం వేయించిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత గరం మసాలా, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత టమాటాలను ఫ్యూరీ లాగా చేసుకుని వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
టమాట ముక్కలు మెత్తబడిన తరువాత జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నీళ్లు, నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు కూరను దగ్గర పడే వరకు ఉడికించుకుని కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట కాజు మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.