Dry Ginger Tea : ఎండబెట్టిన అల్లాన్నే శొంఠి అంటారని మనందరికీ తెలుసు. శొంఠిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణ శక్తిని పెంచి ఆకలిని పెంచడంలో శొంఠి ఎంతో సహాయ పడుతుంది. శొంఠి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగస్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక తరచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడే వారు శొంఠిని వాడడం వల్ల ఇన్ ఫెక్షన్ ల సమస్య తగ్గుతుంది. ఈ పొడిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పలు రకాల క్యాన్సర్ కణాలను పెరగకుండా చేసే శక్తి కూడా శొంఠి పొడికి ఉంది.
స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో శొంఠి సహాయపడుతుంది. పొట్టలో అల్సర్లను తగ్గించడంతోపాటు అల్సర్ల వల్ల వచ్చే అజీర్తి, కడుపులో మంట వంటి వాటిని కూడా శొంఠి తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలలో వాంతులు, వికారం, తల తిరగడం వంటి వాటిని మనం చూడవచ్చు. శొంఠిని వాడడం వల్ల వీటి నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వు స్థాయిలను తగ్గించి గుండెను సంరక్షించడంలో కూడా శొంఠి ఉపయోగపడుతుంది. అయితే శొంఠిని ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియదు.
శొంఠిని పొడిగా చేసి కూరలల్లో వేసుకోవచ్చు లేదా శొంఠి పొడిని మనం రోజూ తయారు చేసుకునే టీ లో కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు టీ కి గాను ఒక టీ స్పూన్ శొంఠి పొడిని వేసి టీ ని తయారు చేసుకుని తాగవచ్చు. ఇలా శొంఠి టీ ని తాగడం వల్ల గొంతులో పేరుకు పోయిన కఫం తొలగి పోవడమే కాకుండా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
పక్షవాతం, మైగ్రేన్ తలనొప్పి ఉన్న వారికి శొంఠి టీ దివ్య ఔషధంలా పని చేస్తుంది. శొంఠి టీ ని తాగడం వల్ల రక్త విరేచనాల నుండి ఉపశమనం లభిస్తుంది. శొంఠి టీ తయారీలో పంచదారకు బదులుగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. పిల్లలకు అప్పుడప్పుడు పాలల్లో శొంఠి పొడిని వేసి మరిగించి ఇవ్వడం వల్ల సాధారణ జలుబు, దగ్గు, స్వరం వంటివి రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.