ఆరోగ్యవంతమైన జీవన విధానం, చక్కని డైట్‌ను పాటించడం వల్ల హైబీపీని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు పొటాషియం ఎంతగానో మేలు చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల హైబీపీ తగ్గుతుంది. దీంతోపాటు శరీరంలో నిత్యం అధికంగా చేరే సోడియం కలిగించే దుష్పరిణామాల నుంచి తప్పించుకోవచ్చు. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. మరి పొటాషియం అధికంగా ఉండే ఆ ఆహారాలు ఏమిటంటే…
1. అరటి పండ్లు
అరటి పండ్లు మనకు సీజన్లతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా దొరుకుతాయి. వీటిల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకాలు జీర్ణశక్తిని పెంచుతాయి. ఆకలిని నియంత్రిస్తాయి. అరటి పండ్లలో అధికంగా ఉండే ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో అధిక బరువును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే అరటి పండ్లలో ఉండే పొటాషియం వల్ల హైబీపీ కూడా తగ్గుతుంది.
2. ఆకుపచ్చని కూరగాయలు
ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలను నిత్యం తీసుకోవాలి. వీటిల్లో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పాలకూరలో పొటాషియం మనకు సమృద్ధిగా లభిస్తుంది. దీన్ని సలాడ్లు లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. అలాగే ఇతర ఆకుపచ్చని కూరగాయలను తినడం వల్ల కూడా పొటాషియం లభిస్తుంది. ఈ క్రమంలో హైబీపీని తగ్గించుకోవచ్చు.
3. పెరుగు
పెరుగులో కాల్షియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తాయి. హైబీపీ ఉన్నవారికి పెరుగు చక్కని ఆహారంగా చెప్పవచ్చు. దీన్ని నిత్యం తీసుకోవడం వల్ల హైబీపీ తగ్గుతుంది.
4. పుచ్చకాయలు
ఇవి వేసవిలో మనకు ఎక్కువగా లభిస్తాయి. నీటి శాతం ఈ కాయల్లో ఎక్కువగా ఉంటుంది. వీటిలో అధికంగా ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. పుచ్చకాయల్లో ఉండే లైకోపీన్, విటమిన్ ఎ, సి, అమైనో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి పోషణను, ఆరోగ్యాన్ని ఇస్తాయి.