పని ఒత్తిడి, వ్యక్తిగత సంబంధాలు, పెళ్లి లేటవ్వడం, సంతాన సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం, కుటుంబీకుల ఆదరాభిమానాలు లేకపోవడం వంటివన్నీ మానసిక ఒత్తిడిని కలిగించేందుకు కారణమవుతుంటాయి. వ్యక్తులను బట్టి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడిని గుర్తించి ముందుగానే చికిత్స తీసుకోవాలి. లేదంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ను కలిగించి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. మీరు మీ జీవితంలో ఒత్తిడి నుంచి విముక్తులు కావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. దీని నుంచి బయటపడేందుకు మీ మైండ్ నే సాయంగా తీసుకోండి. ఆలోచన తీరులో కొన్ని మార్పులు చేసుకుంటే దీని నుంచి బయటపడటం ఎంతో సులభం. జీవితంలో ప్రతి సంఘటన మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది. అందులో దాగి ఉన్న ప్రయోజనాల మీదనే ఫోకస్ పెట్టి నెగిటివిటీని తీసి పారేయండి. దీంతో మీ మనసు సానుకూలంగా మారుతుంది.
గతంలో చేసిన తప్పులను, పొరపాట్లను గుర్తుతెచ్చుకుని బాధపడకండి. మీ చేతుల్లో ఉన్న ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించే ప్రయత్నం చేయండి.మీ లైఫ్ ను ఇతరులతో పోల్చుకోవడం ఇప్పుడే మానుకోండి. ఇది మీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. ఎవరికి వారే ప్రత్యేకం అన్న విషయం గుర్తుంచుకోండి. మిమ్మల్ని నిరంతరం విమర్శించే వారే మీ నిజమైన స్నేహితులని గుర్తుంచుకోండి. మీకు బాధ కలిగించే విషయాలను, వ్యక్తులను మర్చిపోవడానికి ప్రయత్నించండి. హ్యాపీగా ఉంటారు. అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించడానికి ప్రయత్నించి గందరగోళం చెందకండి. ఒక్క సారి ఒక్క విషయం మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఒత్తిడి లేకుండా ఉంటారు. వీలైనంత వరకు ఇతులకు సహాయం చేయడం ద్వారా మీరు మీ చింతలను మరచిపోవచ్చు.
మీ చేతుల్లో ఉన్నవి మాత్రమే మీరు మార్చగలరు. మార్చలేని విషయాలను గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు. వాటి కోసం మీ ఎనర్జీని పోగొట్టుకోకండి. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. అందుకే కాలం విలువను గుర్తుంచుకోండి. ఈ నిమిషం ఎలా జీవిస్తున్నారనే దానిపైనే మనసును లగ్నం చేయండి. గతాన్ని పదే పదే తవ్వుకోవడం, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం రెండూ మంచివి కావు. ప్రపంచమే ఓ జగన్నాటకం. అందులో ఒక్కొక్కరిదీ ఒక్కో పాత్ర. మనమంతా నటులమే. మీరు మీ పాత్రను సరిగ్గా పోషిస్తున్నారా లేదా చూసుకోండి. ఇతరుల పనితీరు మిమ్మల్ని బాధించకూడదు. ఇతరులు మనకు నచ్చినట్టుగా ఉండటం లేదనే బాధే కాలక్రమేణా మనలో ఒత్తిడిని కలుగజేస్తుంది. జీవితంలో ఎవరికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యం వారికిస్తూ ముందుకు కదిలిపోతూ ఉండాలి. ఆగి ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఆగిపోతారు.
మనసును అసూయ, ద్వేషాలతో మండించకండి. మీకు నచ్చిన దైవాన్ని ధ్యానించుకోండి. వారి మార్గంలో నడవండి. మనసుకు అపారమైన శాంతి కలుగుతుంది. దాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. ఆనందం ఎక్కడో ఉండదు. మనలోనే ఉంటుంది. దాన్ని ఇతరుల నుంచి కోరుకోవడం అమాయకత్వం. మీకున్న దాంట్లో పంచడంలోనే అసలైన సంతోషం ఉంది. ఎప్పుడూ ఇచ్చేవారుగా ఉండేందుకే ప్రయత్నించండి. కర్మ సిద్దాంతం ప్రకారం.. మీరు ఏదైనా సమస్యను తీవ్ర స్థాయిలో ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మీ గత కర్మలు కరిగిపోతున్నాయని.. దాని నుంచి మీరు విముక్తి పొందుతున్నారని అర్థం. మీలో మీకే తెలియకుండా ఉండే ఆ చిన్న పాటి అహాన్నికూడా త్యాగం చేసేయండి. వచ్చినప్పుడు ఏం తీసుకురాం.. వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లమని గుర్తుంచుకోండి. మీ సమస్యలన్నింటినీ మీ ఇష్టదైవానికి అప్పజెప్పి మీరు చింతను వదిలి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రతిరోజూ కనీసం కొద్దిసేపు ధ్యానం, లేదా ఇష్టదైవ నామస్మరణ చేసుకోవాలి. ఇది మీ మానసిక, శారీరక ఆరోగ్యంలో ఎన్నో మార్పులను తీసుకురాగలదు.