బరువు తగ్గటంపై న్యూయార్క్ యూనివర్శిటీ తీవ్రంగా కొన్ని తాజా పరిశోధనలు చేసింది. ప్రతివారూ తాము బరువుతగ్గటానికి వ్యాయామాలు చేస్తున్నామని, డైటింగ్ చేస్తూ ప్రత్యేక ఆహారాలు మాత్రమే తీసుకుంటున్నామని ఎంతో ప్రచారం చేసుకోడం విఫలమైపోవటం జరుగుతోందని, ఈ రకమైన ప్రచారాలను తాము పరిశీలించామని చెపుతోంది. అయితే, ఒక సారి తమ లక్ష్యాలను గురించి తమ స్నేహితులతోను, బంధువులతోను ఈ రకమైన పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తులు వాటిని ఆచరించలేకపోతున్నారట. కారణం అది విజయవంతమైపోతుందనే భావనలో వుండి ఇక ఆపై వారు తమ డైటింగ్ లేదా వ్యాయామ ప్రణాళికలను ఆచరించలేకపోతున్నారట.
కనీసం గతంలో ఆచరించినంతగా కూడా వేసుకున్న ప్రణాళికలు ఆచరించలేపోవటానికి కారణం ఒక సారి నోరు తెరచి చెప్పేసుకుంటే, ఇక వారంతట వారు ఫలితాలు వచ్చేసినట్లే భావించి ఆచరణలో శూన్యం చేసుకుంటున్నారట. ఈ పరిశోధనాంశాన్ని ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ డా. పీటర్ గోల్ విట్జర్ సిఎన్ఎన్ వార్తా సంస్ధకు తెలిపినట్లు ది డైలీ మెయిల్ వెల్లడించింది. మరి డైటర్స్ ఏం చేయాలి? సింపుల్ – ఎవరికి తమ ప్రణాళికలు తెలుపకుండా నోరు మూసుకోవాలి.
మీరు చేయాలనుకున్నదే కాదు ఎపుడు, ఎక్కడ, ఎలా ఆచరిస్తారనేది కూడా మనసులోనే పెట్టుకోవాలి. ఒక వేళ మీ లక్ష్యాన్ని చెప్పాలంటే, మీ డైట్ ప్లాన్ కు సహకరించే, ప్రోత్సహించే అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలపాలని కూడా వీరు చెపుతున్నారు. మొదటగా మీ శరీర మార్పు మీరే గమనించుకోవాలని, తర్వాత అందరికి ఆ మార్పు కనపడాలని అపుడే ఖచ్చితంగా మీరు మీ ప్రణాళికలు విఫలత లేకుండా ఆచరించగలరని పరిశోధకులు చెపుతున్నారు.