సముద్ర తీర ప్రాంతం లేని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో పెరిగే చేపలను చాలా మంది తింటారు. కానీ వాటి కన్నా సముద్ర చేపలే మిక్కిలి పోషకాలను కలిగి ఉంటాయి. వాటిని తరచూ తీసుకోవాలి. ఈ చేపలు రుచికరంగా ఉండడమే కాదు, సాధారణ చేపల కన్నా ఎక్కువ పోషకాలను మనకు అందజేస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. సముద్రపు చేపలను తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటంటే…
1. ఆర్థరైటిస్
సముద్రపు చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్‌ను తగ్గిస్తాయి. శరీరంలో వాపులు తగ్గుతాయి. కీళ్లలో దృఢత్వాన్ని తగ్గిస్తాయి. దీంతో అవి సులభంగా కదులుతాయి. సముద్రపు చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరం కాల్షియాన్ని ఎక్కువగా శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ముఖ్యంగా చిన్నారులకు తరచూ సముద్ర చేపలను తినిపించడం వల్ల వారి ఎముకల పెరుగుదల సరిగ్గా ఉంటుంది. అలాగే భవిష్యత్తులో ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు సముద్రపు చేపలను తింటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
2. కంటి ఆరోగ్యానికి
సముద్రపు చేపల్లో పుష్కలంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కంటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. వయస్సు మీద పడ్డాక కంటి చూపు తగ్గే సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే రాత్రి పూట కూడా కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా రేచీకటి రాకుండా ఉంటుంది. అలాగే కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.
3. రోగ నిరోధక శక్తి
మన శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేయాలంటే అందుకు జింక్ అనే పోషక పదార్థం కూడా అవసరమే. అయితే సముద్రపు చేపలతోపాటు పీతలు, రొయ్యలు, నత్తల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఆహారాలను తరచూ తింటే జింక్ ఎక్కువగా అందుతుంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక ఈ ఆహారాల్లో ఉండే విటమిన్ ఎ, సెలీనియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన శరీరంలోకి చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. అలాగే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
4. గుండె ఆరోగ్యానికి
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల ప్రకారం.. వారంలో కనీసం ఒకసారి సముద్రపు చేపలను తింటే.. హార్ట్ ఎటాక్‌లు, ఇతర గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వెల్లడైంది.
5. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తికి
సముద్రపు చేపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చిన్నారులు, యుక్తవయస్సుల్లో ఉన్నవారికి మెదడు చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉంటుంది.
6. డిప్రెషన్
నిత్యం మనం అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఒత్తిడిని ఎదుర్కొంటుంటాం. అయితే సముద్ర చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే ఆ ఒత్తిడి నుంచి బయట పడవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. సముద్రపు చేపలను తినడం వల్ల డిప్రెషన్ నుంచి కూడా బయట పడవచ్చు.
7. చర్మ సంరక్షణకు
సముద్రపు చేపలను తినడం వల్ల వాటిలో ఉండే పోషకాలు చర్మానికి సంరక్షణను అందిస్తాయి. ముఖ్యంగా సూర్యుని నుంచి వచ్చే హానికారక అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల ప్రకారం.. సముద్రపు చేపలను తినడం వల్ల మొటిమలను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే చర్మ సమస్యలు కూడా పోతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365