Healthy Foods : నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారి జీవిత కాలాన్ని వారి చేతులతో వారే తగ్గించుకుంటున్నారు. నడి వయసులోనే రోగాల బారిన పడి వారి జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతున్నారు. మనం ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా బ్రతికినన్ని రోజులు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఏడు నియమాలను తప్పకుండా పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడు నియమాలను సరిగ్గా క్రమం తప్పకుండా పాటించినప్పుడే మనం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించగలుగుతాము. చక్కటి ఆరోగ్యం కోసం మనం పాటించాల్సిన ఏడు నియమాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కటి ఆరోగ్యం కావాలనుకునే వారు మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారం, సరిపడా వ్యాయామం, సరైన విసర్జన, సరిపడా విసర్జన, మంచి ఆలోచనా వంటి ఏడు నియమాలను పాటించాలి. ఈ ఏడింటిని కూడా మన దినచర్యలో భాగం చేసుకోవాలి. ప్రతిరోజూ ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయడం వల్ల గాలిని ఎక్కువగా పీల్చుకోవచ్చు. ఊపిరితిత్తుల సామర్య్థం పెరుగుతుంది. గాలి శరీరంలోకి తగినంత వెళ్లితేనే ఆయుష్షు పెరుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ పావు గంట నుండి అరగంట పాటు ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే రోజూ 4 లీటర్ల నీటిని తాగాలి. క్రమ పద్దతిలో ఇలా నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అదే విధంగా పోషకాలు కలిగిన ఆహారాన్నే ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, నూనెలు తగ్గించి తీసుకోవాలి. 60 నుండి 70 శాతం ఉడికించిన ఆహారాలు కాకుండా సహజ ఆహారాలను తీసుకునే ప్రయత్నం చేయాలి.
అలాగే రోజూ వ్యాయామం చేయాలి. సూర్య నమస్కారాలు, వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. శరీరంలో వ్యర్థాలు బయటకు పోతాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే విధంగా రోజూ రెండు నుండి మూడు సార్లు మలవిసర్జన అయ్యేలా చూసుకోవాలి. రెండు నుండి రెండున్నర లీటర్ల మూత్రవిసర్జన చేయాలి. దాదాపు లీటరు మోతాదులో చెమట బయటకు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల శరీరం పరిశుభ్రంగా ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటల లోపు ఆహారాన్ని తీసుకుని శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి. కడుపు నిండా తిని నిద్రపోతే పొట్టకు విశ్రాంతి ఉండదు.
కనుక శరీరంలో పూర్తి అవయవాలకు విశ్రాంతి ఇవ్వాలంటే సాయంత్రం భోజనాన్ని త్వరగా చేసేసి నిద్రపోవడం వల్ల శరీరానికి పూర్తి విశ్రాంతి లభిస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన, కోపం, చిరాకు వంటివి లేకుండా మంచిగా ఆలోచించాలి. ప్రశాంతంగా ఉండడం వల్ల హార్మోన్లు చక్కగా ఉత్పత్తి అవుతాయి. దీంతో శరీరం సక్రమంగా పని చేస్తుంది. ఈ విధంగా ఈ ఏడు నియమాలను పాటించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని మనం జీవితకాలం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.