తిన్న తర్వాత నడవొచ్చా లేదా? ఎంతసేపు నడవాలి? ఇలాంటి సందేహాలు మనలో చాలామందిని వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి సందేహాలన్నిటికీ చెక్ పెట్టింది తాజా అధ్యయనం. తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల టైప్ 2 మధుమేహం, గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం తెలిపింది. భోజనం తర్వాత 2 నుండి 5 నిమిషాల నడకతో రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన మెటా-విశ్లేషణలో రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలతో సహా గుండె ఆరోగ్యానికి సంబంధించిన చర్యలపై కూర్చోవడం లేదా నిలబడటం లేదా నడవడం వంటి ప్రభావాలను పోల్చిన ఏడు అధ్యయనాల ఫలితాలను పరిశోధకులు పరిశీలించారు. భోజనం తర్వాత రెండు నుండి ఐదు నిమిషాల వ్యవధిలో తేలికపాటి నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని వారు కనుగొన్నారు.
తిన్న తర్వాత 60 నుండి 90 నిమిషాలలోపు నడవడానికి బెస్ట్ టైమ్ అని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అధ్యయనంలో పాల్గొనేవారిలో నడిచేవారిని ఒక గ్రూపుగా, నిల్చునేవారిని ఒక గ్రూపుగా డివైడ్ చేశారు. ఈ రెండు గ్రూపులను ఒక రోజు వ్యవధిలో ప్రతి 20 నుండి 30 నిమిషాలకు 2 నుండి 5 నిమిషాల వరకు నిలబెట్టడం, నడవడం చేయించారు.ఏడు అధ్యయనాలలోని ఐదింటిలో.. అధ్యయనంలో పాల్గొనేవారికి ప్రీడయాబెటిస్ లేదా టైప్ 2 మధుమేహం వంటివి లేవు. రెండు ఇతర అధ్యయనాలలో మధుమేహం ఉన్న వ్యక్తులను, లేని వ్యక్తులను పరీక్షించారు. మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులను నివారించాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేశారు. ఎందుకంటే దీని ప్రభావం వారి దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
మధుమేహం కంట్రోల్ లో ఉండకపోతే గుండె సమస్యలు, మూత్రపిండాల, కాలేయ వైఫల్యంతో సహా అనేక ఇతర సమస్యలకు కారణమవుతుంది. కొన్ని నిమిషాల రోజువారీ యాక్టివిటీ, తేలికపాటి నడకలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనం వెల్లడించింది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను కూడా తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు.