ప్రస్తుతం ప్రజలకి మంచి చేసేందుకు అనేక స్కీంలు అందుబాటులోకి వస్తున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాల్లో ఒకటి. ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో పాటు మంచి రాబడులు కూడా అందిస్తుంది. వడ్డీ, రాబడిపై ఆదాయ పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. చిన్న మొత్తం పొదుపులను రాబడులిచ్చే పెట్టుబడుల రూపంలో సమీకరించే ఉద్దేశంతో 1968లో కేంద్రం పీపీఎఫ్‌ను ప్రారంభించింది. ఇది పొదుపుతో పాటు పన్ను మినహాయింపులను కూడా అందిస్తుంది. పెద్దగా రిస్కులు లేకుండా ఇటు పన్నులు ఆదా చేసుకోవడంతో పాటు గ్యారంటీగా రాబడులు కావాలని కోరుకునే వారికి పీపీఎఫ్ సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పనికొస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో నిర్దిష్ట రీతిలో పెట్టుబడులు పెట్టి, పూర్తి కాలవ్యవధి వరకు ఆగితే కోటి రూపాయలకుపైగానే అందుకోవచ్చు. పీపీఎఫ్.. కేంద్ర ప్రభుత్వం అందించే పథకం కావడంతో ఇదో సురక్షిత పెట్టుబడి అని చెప్పాలి. పిల్లల చదువు, వివాహాలు తదితర లక్ష్యాల సాధనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక దీనిపై ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను 7.1 శాతం వడ్డీరేటున్నది. దీన్నిబట్టి ఈ పథకంలో గరిష్ఠ స్థాయి పెట్టుబడులు పెడితే కాలపరిమితి తీరాక కోటీశ్వరులం అవుతాము. పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ 15 ఏండ్లు. ఇందులో ఏటా గరిష్ఠంగా రూ.1.5 లక్షల పెట్టుబడి పెడితే 15 ఏండ్లకు రూ.22.5 లక్షలు అవుతుంది. దీనికి 7.1 శాతం వడ్డీ ప్రయోజనాన్ని జతచేస్తే ఆ మొత్తం రూ.40,68,209 అవుతుంది.
వడ్డీ వాటానే రూ.18,18,209. ఇక మీ పీపీఎఫ్ ఖాతాను నిర్ణీత కాలపరిమితి తీరాక ఐదేండ్ల చొప్పున రెండుసార్లు అంటే 10 సంవత్సరాలు పొడిగించుకుంటే మొత్తం 25 ఏండ్ల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి రూ.1,03,08,014. 97 అవుతుంది. ఒకవేళ మరో ఐదేండ్లు దీన్ని ఆపితే అది రూ.1,54,50,910.59కి చేరుతుంది. కాగా, పీపీఎఫ్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500, గరిష్ఠంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. రూ.50కి తగ్గకుండా ఎన్నిసార్లు అయిన కూడా డిపాజిట్లు చేయవచ్చు. డిపాజిట్లకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద ప్రయోజనాలుంటాయి. అలాగే వడ్డీ ఆదాయానికీ పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.