యోగాతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. దాంతో శారీరకంగానే కాదు, మానసికంగానూ మనకు ఉల్లాసంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అయితే యోగా అంటే… అందులో ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయి. కేవలం గురువులు మాత్రమే అన్ని ఆసనాలను వేయగలరు. అన్ని ఆసనాలను వేయగలిగిన వారు కొందరే ఉంటారు. కానీ… ఇప్పటికే యోగాలో ఉన్న అన్ని ఆసనాలకు తోడు ఇప్పుడు ఓ కొత్త తరహా ఆసనాలు వేసే విధానం ట్రెండింగ్‌లో ఉంది. అదే… బీర్ యోగా..! మొదట విదేశాల్లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన దేశానికీ పాకింది. ఇంతకీ బీర్ యోగా అంటే ఏమిటి..?
బీర్ యోగా అంటే ఏమీ లేదండీ… సాధారణంగా వేసే యోగా ఆసనాలే..! కొత్త ఆసనం ఏమీ కాదు. కాకపోతే బీర్ తాగుతూ, బీర్ బాటిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ యోగా చేస్తారన్నమాట. అంతే..! అందుకే దానికి బీర్ యోగా అనే పేరు వచ్చింది. మొదట దీన్ని అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లో ప్రారంభించారట. అక్కడ ఇందు కోసం ప్రత్యేకమైన క్లాసులు కూడా పెట్టారట. అయితే ఇది ముఖ్యంగా యూత్‌కు ఎంతగానో నచ్చడంతో ఇప్పుడంతటా క్రమంగా పాపులర్ అవుతోంది. మన దేశంలోనూ బీర్ యోగా ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతోంది.
సాధారణంగా బీర్ అంటే ఎన్నో వందల క్యాలరీల శక్తి ఉంటుంది అందులో. ఈ క్రమంలో బీర్ తాగితే ఆ శక్తి మనకు లభిస్తుంది. కానీ… వ్యాయామం చేస్తేనే ఆ శక్తిని ఖర్చు చేయగలం. అలా చేయకపోతే అదంతా కొవ్వుగా మారుతుంది. ఈ క్రమంలో ఓ వైపు బీర్ తాగుతూనే, మరో వైపు యోగా చేస్తే దాంతో ఓ వైపు బీర్ కిక్కు లభిస్తుంది, రెండో వైపు యోగాతో ఆరోగ్యం కూడా బాగు పడుతుంది. కనుకే చాలా మంది యోగాలో ఈ కొత్త విధానాన్ని ఇప్పుడిప్పుడే అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే… ఇప్పుడు మన దగ్గర చాలా పబ్‌లు, లాంజ్‌లలో ప్రత్యేకమైన బీర్ యోగా క్లాసులు కూడా చెబుతున్నారట..! అంతే మరి..! కొత్తగా ఏదైనా వస్తే… అది మనకు వింతేగా..! దాన్ని పాటించేదాకా నిద్రపోం..!