నిద్ర అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం. రోజూ మనం కచ్చితంగా నిర్దిష్ట సమయం పాటు నిద్రపోవాల్సిందే. లేదంటే ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయో అందరికీ తెలుసు. డయాబెటిస్, స్థూలకాయం వంటివి దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే శారీరక ఆరోగ్యం పరంగానే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా మనకు నిద్ర అవసరమే. ఏదైనా రోజు సరిగ్గా నిద్ర పోకపోతే మరుసటి రోజు ఉదయం నుంచి ఒత్తిడి, ఆందోళన వంటివి వచ్చేస్తాయి. ఈ క్రమంలో అటు శారీరకంగా, ఇటు మానసికంగా రెండు విధాలుగా మనకు చేటు కలుగుతుంది. అయితే నిద్రపోకపోతే ఇలా మనకు కలిగే నష్టాలు ఏమిటో తెలుసు, కానీ మీకు తెలుసా..? నిద్ర అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా మనకు లాభాలను తెచ్చి పెడుతుందట. అదెలాగంటారా..? అయితే మీరే చదివి తెలుసుకోండి..!
రోజూ నిద్రించే ముందు దిండు కింద ఒక గుప్పెడు సోంపు గింజలను పెట్టుకుని నిద్రించండి. దీంతో మీకు చెడు కలలు రావు. ఇలా చేయడం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారమైతే మీకు జీవితంలో అంతా శుభమే జరుగుతుందట. లక్ కలసి వస్తుందట. ఒక రాగి పాత్రను తీసుకుని అందులో నిండా నీరు పోసి నింపాలి. అనంతరం ఆ పాత్రను నిద్రకు ఉపక్రమించే ముందు తల పక్కగా వచ్చేట్టు ఏదైనా టేబుల్‌పై ఉంచాలి. ఉదయాన్నే ఆ పాత్రను తీసి అందులోని నీటిని మొక్కలకు పోయాలి. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందట. నిద్రకు ఉపక్రమించే ముందు మనసుకు ఉల్లాసం, ప్రేరణ కలిగించే ఏవైనా పుస్తకాలను చదవాలి. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. అంతేకాదు, చెడు కలలు రావు. స్ట్రెస్ హార్మోన్లు ప్రభావం చూపవు. మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటారు.
నిద్రించే ముందు 10 నిమిషాల పాటు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి. ధ్యాస అంతా కేవలం ఒకే దానిపై నిలపాలి. ఇలా రోజూ చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ముందుకు దూసుకెళ్తారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. పాదాలను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుని వాటికి కొబ్బరినూనె, కర్పూరం కలిపిన మిశ్రమాన్ని రాయాలి. దీంతో చెడు కలలు రావు. నిద్ర చక్కగా పడుతుంది. ఇలా చేస్తే లక్ కూడా కలసి వస్తుందట. నిద్రించడానికి ముందు 15 నిమిషాల పాటు నడవాలి. అనంతరం కింది విష్ణు మంత్రాన్ని పఠించి నిద్రపోవాలి. దీంతో అంతా శుభమే కలుగుతుంది. అదృష్టం కలసి వస్తుందట.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |, లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||