అనారోగ్యం వస్తే చికిత్స చేయించుకునేందుకు మనకు ఎన్నో వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. అల్లోపతి, హోమియోపతి, నాచురోపతి… ఇలా..! అయితే వీటన్నింటిలోనూ మన భారతీయ సాంప్రదాయ వైద్య విధానం ఆయుర్వేదం ముఖ్యమైంది. ఆయుర్వేద ప్రకారం ఏ వ్యాధి అయినా వాత, పిత్త, కఫాలనే 3 అంశాల అసమతుల్యత కారణంగా వస్తుంది. అయితే ఈ మూడింటిని బట్టి వ్యాధులే కాదు, వ్యక్తుల శరీరాలు కూడా ఉంటాయి. కొందరికి వాత శరీరం ఉంటే, కొందరిది పిత్త ఆధారిత శరీరం అయి ఉంటుంది. ఇంకొందరిది కఫ శరీరం అయి ఉంటుంది. మరి… ఎవరిది ఎలాంటి శరీరమో తెలుసుకోవడం ఎలా..? అందుకు తగిన ఆహారం తీసుకోవడమెలా..? అనేది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
వాత, పిత్త, కఫాల్లో ఎవరిది ఏ తరహా శరీరమో కింద ఇచ్చిన విషయాలను బట్టి సులభంగా తెలుసుకోవచ్చు. అదెలాగంటే… వాత శరీరం ఉన్నవారు…. శరీరం బక్క పలుచగా ఉంటుంది. అవయవాలు చిన్నగా ఉంటాయి. వెంట్రుకలు పొడి బారి ఉంటాయి. పలుచగా ఉంటాయి. నిద్రలేమితో ఉంటారు. ఎల్లప్పుడూ డిస్టర్బ్ అయి ఉంటారు. దేన్నీ తట్టుకోలేరు. ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారు. వీరి స్వభావం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది. పిత్త శరీరం ఉన్నవారు…. వీరు మరీ బక్కగా ఉండరు, అలా అని చెప్పి బాగా లావుగా ఉండరు. వీరి చర్మం మృదువుగా ఉంటుంది. వెంట్రుకలు పలుచగా ఉంటాయి. అవి త్వరగా తెల్లబడుతాయి. వీరికి ఆకలి ఎక్కువ. జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది.
కఫ శరీరం ఉన్నవారు… వీరు లావుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఊబకాయులుగా ఉంటారు. వెంట్రుకలు దట్టంగా, దృఢంగా, సాఫ్ట్‌గా ఉంటాయి. గురక పెట్టి నిద్రిస్తారు. ప్రశాంతంగా ఉంటారు. మంచి ఏకాగ్రత కలిగి ఉంటారు. దేన్నయినా శ్రద్ధగా వింటారు. వాత, పిత్త, కఫ శరీరాలు ఉన్నవారిలో ఎవరు ఏయే ఆహారం తినాలో, ఏది తినకూడదో ఇప్పుడు చూద్దాం. వాత శరీరం ఉన్నవారు – ఉడికించిన ఆహారం మాత్రమే తినాలి, ఆరోగ్యకరమైన కొవ్వు కలిగి ఉన్న పదార్థాలను తీసుకోవాలి, టీ, దాల్చిన చెక్క వంటి మసాలాలను తక్కువగా తినాలి, చల్లని పదార్థాలను తినకూడదు, చేదుగా, వగరుగా ఉండే పదార్థాలను ముట్టరాదు.
పిత్త శరీరం ఉన్నవారు – చల్లని పదార్థాలు, స్వీట్లు, చేదు కూరగాయలు, పండ్లు, పసుపు వంటి పదార్థాలను తినాలి, మద్యం, మసాలా ఆహారం, ఆయిల్ ఫుడ్, పులిసిన ఆహారం తినరాదు. కఫ శరీరం ఉన్నవారు – చేదుగా, పచ్చిగా ఉన్న కూరగాయలు, మసాలా ఆహారం, అల్లం వంటి పదార్థాలు తినాలి, పుల్లని పండ్లు, ఆయిల్, ఫ్యాట్ ఆహారం, చక్కెర తినకూడదు.