మనకు తినేందుకు అనేక రకాల కొవ్వు పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని రకాల కొవ్వు పదార్థాలు చెడువి కావు. అంటే.. మన ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మనకు మంచి చేసే, చెడు చేసే కొవ్వు పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి కదా. ఒకదాన్ని మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) అంటారు. రెండో దాన్ని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) అంటారు. మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అందువల్ల మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే ఆహారాలు అదే కోవకు చెందుతాయి. వీటి వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ ఫ్యాట్స్ లో మళ్లీ రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండూ ఆరోగ్యకరమైనవే. ఒకటి మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి ఆలివ్ ఆయిల్, అవకాడో, బ్రెజిల్ నట్స్, బాదంపప్పు, కనోలా ఆయిల్, పల్లీలు (వేరుశెనగ) వంటి వాటిల్లో ఉంటాయి. ఇక రెండోవి.. పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి పొద్దు తిరుగుడు విత్తనాలు, నూనె, మొక్కజొన్న, సోయాబీన్, చేపలు, వాల్ నట్స్, అవిసె గింజలు వంటి వాటిల్లో ఉంటాయి. అయితే ఈ రెండు రకాల ఫ్యాట్స్ మనకు ఆరోగ్యకరమే. ఇప్పుడు చెప్పిన ఆహారాలను తరచూ తింటుంటే మన శరీరానికి ఆయా ఫ్యాట్స్ అందుతాయి. దీంతో శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
శాచురేటెడ్ ఫ్యాట్స్
ఈ ఫ్యాట్స్ ఎక్కువగా జంతు సంబంధ పదార్థాలలో ఉంటాయి. కొన్ని వృక్ష సంబంధ పదార్థాల్లోనూ ఇవి ఉంటాయి. అయితే వీటిని పూర్తిగా అనారోగ్యకరమైన కొవ్వులు అనలేం. ఎందుకంటే వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటే మనకు ప్రయోజనమే ఉంటుంది. కానీ మోతాదుకు మించకూడదు. మాంసం, చికెన్, పాలు, కోడిగుడ్డులోని పచ్చనిసొన, పాల ఉత్పత్తులు, కొబ్బరినూనె, తల్లిపాలు వంటి పదార్ధాల్లో ఈ ఫ్యాట్స్ ఉంటాయి. అయితే కొందరు సైంటిస్టులు ఈ ఫ్యాట్స్ మంచివి కావని చెప్పారు. కొందరు మంచివేనని అన్నారు. కానీ.. వీటిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ఫ్యాట్స్ నిజానికి శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్‌లను రెండింటినీ పెంచేందుకు అవకాశం ఉంటుంది. అలా జరిగితే పెద్దగా ప్రయోజనం ఉండదు. కనుక వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఎక్కువైతే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ట్రాన్స్ ఫ్యాట్స్
వీటిని అస్సలు తీసుకోరాదు. ఎందుకంటే వీటిని తినడం వల్ల మన శరీరానికి ఏమాత్రం ప్రయోజనం ఉండదు సరికదా. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. అన్ని రకాల జంక్ ఫుడ్, చిరు తిళ్లు, నూనె పదార్థాలు, వేపుళ్లు వంటి పదార్థాలలో ఈ ఫ్యాట్స్ ఉంటాయి. కనుక ఆయా పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది.
కనుక ఇప్పుడు తెలుసుకున్నారు కదా. కొవ్వులన్నీ అనారోగ్యకరమైనవి కావని. వాటిల్లో ఆరోగ్యకరమైనవి కూడా ఉంటాయి. వాటిని తీసుకుంటేనే మనకు ప్రయోజనాలు కలుగుతాయి. కనుక ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలనే నిత్యం మనం తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.