Biyyam Pindi Chips : మనకు బయట షాపుల్లో వివిధ రుచుల్లో వివిధ రకాల చిప్స్ లభిస్తాయి. ఈ చిప్స్ రుచిగా ఉన్నప్పటికి వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పవచ్చు. బయట లభించే చిప్స్ ను నిల్వ చేయడానికి రసాయనాలను ఎక్కువగా వాడతారు. వీటికి బదులుగా మనం ఇంట్లోనే ఎంతో రుచికరమైన చిప్స్ ను తాజాగా తయారు చేసుకుని తినడం ఉత్తమం. మన ఇంట్లో ఉండే బియ్యంపిండితో చేసే ఈ చిప్స్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. తిన్నా కొద్ది తినాలనిపించే ఈ బియ్యం పిండి చిప్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒకటిన్నర కప్పు, ఉప్పు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, బియ్యం పిండి – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కారం – అర టీ స్పూన్, మిరియాల పొడి – కొద్దిగా.
బియ్యం పిండి చిప్స్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, జీలకర్ర వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం పిండి వేసి కలపాలి. బియ్యం పిండి అంతా కలిసేలా కలిపిన తరువాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బియ్యం పిండి చల్లారిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకుని చేత్తో వత్తుతూ మెత్తగా కలుపుకోవాలి. పిండిని 4 నిమిషాల పాటు కలుపుకున్న తరువాత దీనిని 3 లేదా 4 ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో పలుచగా చపాతీలా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తరువాత ఫోర్క్ తో అక్కడక్కడ రంధ్రాలు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని మనకు నచ్చిన ఆకారంలో చిప్స్ లాగా కట్ చేసుకోవాలి.
ఇలా చిప్స్ ను తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చిప్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ చిప్స్ పై కారం, ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి చిప్స్ తయారవుతాయి. ఈ చిప్స్ ను పిల్లు ఇష్టంగా తింటారు. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో ఇలా బియ్యం పిండితో చిప్స్ ను తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు. వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.