Chettinad Masala Dosa : చెట్టినాడ్ మసాలా దోశ.. ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. చట్నీ లేకుండా దీనిని నేరుగా తినేయవచ్చు. మినపప్పుతో పాటు అన్ని రకాల పప్పులను ఈ దోశల తయారీలో వాడుతాము. కనుక దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ దోశలను తయారు చేయడం చాలా సులభం. తరుచూ ఒకేరకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. రుచితో పాటు శరీరానికి బలాన్ని చేకూర్చే ఈ చెట్టినాడ్ మసాలా దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చెట్టినాడ్ మసాలా దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
రేషన్ బియ్యం – ఒక కప్పు, కందిపప్పు – అర కప్పు, శనగపప్పు – అర కప్పు, పెసరపప్పు – పావు కప్పు, మినపప్పు – పావు కప్పు, ఎండుమిర్చి – 6, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – తగినన్ని.
చెట్టినాడ్ మసాలా దోశ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత మిగిలిన పప్పులన్నీ వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్నినీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టాలి. బియ్యం, పప్పులు నానిన తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఎండుమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలాపిండి అంతా మిక్సీ పట్టుకున్న తరువాత మనకు కావల్సినంత పిండిని తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిజ్ లో ఉంచాలి. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి.తరువాత దీనిపై కొద్దిగా నూనె వేసి టిష్యూ పేపర్ తో తుడవాలి. తరువాత పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసాము కనుక ఈ దోశ మరీ పలుచగా రాదు. దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. తరువాత దోశను మరో వైపుకు తిప్పుకుని కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చెట్టినాడ్ మసాలా దోశ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఇలా తయారు చేసిన దోశను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.