Coconut Mango Chutney : పచ్చి కొబ్బరిని మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. పచ్చికొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పచ్చి కొబ్బరితో మనం చేసుకోదగిన వంటకాల్లో కొబ్బరి పచ్చడి ఒకటి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పచ్చడిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పచ్చి కొబ్బరికి మామిడికాయను కలిపి మరింత రుచిగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. పచ్చికొబ్బరి మామిడికాయ సిద్దంగా ఉండాలే కానీ ఈ పచ్చడిని మనం కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక కప్పు, మామిడికాయ – 1 ( మధ్యస్థంగా ఉన్నది), పచ్చిమిర్చి – 10, నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత.
కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పచ్చికొబ్బరి ముక్కలు, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చిని తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో మామిడికాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని కొబ్బరి మిశ్రమంలో వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు.