Foods For Cold And Cough : మారిన వాతావరణంగా కారణంగా మనలో చాలా మంది జలుబు సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ జలుబుతో బాధపడుతున్నారు. జలుబు కారణంగా కలిగే ఇబ్బంది, అస్వస్థత అంతా ఇంతా కాదు. జలుబు కారణంగా ముక్కు నుండి నీరు కారడం, ముక్కు దిబ్బడ, తలనొప్పి, నీరసం, చికాకు వంటి ఇబ్బందులు కలుగుతాయి. చాలా మంది జలుబు బారిన పడగానే మందులను, యాంటీ బయాటిక్ లను వాడుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా సులభంగా జలుబు సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. జలుబు నుండి ఉపశమనాన్ని కలిగించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జలుబుతో బాధపడుతున్నప్పుడు చికెన్ సూప్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు, పోషకాలు జలుబును తగ్గించడంలో దోహదపడతాయి.
జలుబుతో బాధపడుతున్నప్పుడు వేడి వేడి చికెన్ సూప్ ను తీసుకోవడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. జలుబు నుండి ఉపశమనాన్ని కలిగించడంలో నిమ్మజాతికి చెందిన పండ్లు ఎంతో దోహదపడతాయి. నారింజ, నిమ్మకాయ వంటి నిమ్మజాతికి చెందిన పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగాఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, జలుబును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే జలుబు ఇబ్బంది పెడుతున్నప్పుడు గ్రీన్ టీ, బ్రోకలీ, బ్లూబెర్రీ వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటిలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది జలుబును తగ్గించడంలో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జలుబుతో బాధపడుతున్నప్పుడు మిరియాలు, కారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఇక అల్లం టీ ని తీసుకోవడం వల్ల కూడా జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. అల్లంలో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వేడి వేడి అల్లం టీని తాగడం వల్ల జలుబుతో పాటు జలుబు వల్ల కలిగే ఇతర ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అయితే చాలా మంది జలుబు చేసినప్పుడు ఉపశమనం కోసం వేడి వేడి కాఫీని, మద్యాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ జలుబు చేసినప్పుడు ఈ ఆహారాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మందులు వాడే అవసరం లేకుండా మనకు జలుబు నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది.