Idli Chutney : మనం ఉదయం పూట అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను తయారు చేస్తూ ఉంటాం. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. చట్నీ ఉంటేనే ఇడ్లీ తినడానికి వీలుగా ఉంటుంది. అలాగే చట్నీ రుచిగా ఉంటేనే ఇడ్లీలను తినగలం. రుచిగా, సులభంగా, అలాగే తక్కువ సమయంలో అయ్యేలా కూడా మనం ఇడ్లీ చట్నీని తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీలతో ఇడ్లీలను తింటే ఎన్ని తిన్నారో కూడా తెలియనంతంగా తినేస్తారు. అంత రుచిగా ఈ చట్నీ ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ చట్నీ తయారీ విధానాన్ని అలాగే తయారీకి కావల్సిన పదార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, పల్లీలు – అర కప్పు, పచ్చిమిర్చి – 8 లేదా కారానికి తగినన్ని, అల్లం – అర ఇంచు ముక్క, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, పుట్నాలు – అర కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు, చింతపండు – ఒక చిన్న రెమ్మ, నీళ్లు – ముప్పావు గ్లాస్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
ఇడ్లీ చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు, పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేయించాలి. పల్లీలు, పచ్చిమిర్చి చక్కగా వేగిన తరువాత వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. చట్నీ పలుచగా కావాలనుకుంటే మరికొన్ని నీళ్లు కూడా పోసుకుని కలుపుకోవచ్చు. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న చట్నీలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ చట్నీ తయారవుతుంది. దీనిని ఇడ్లీతోనే కాకుండా దోశ, వడ వంటి అల్పాహారాలతో కూడా తినవచ్చు.