Kakarakaya Nilva Pachadi : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలల్లో కాకరకాయలు కూడా ఒకటి. కాకరకాయలు చేదుగా ఉంటాయని చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. తరచూ చేసే వంటకాలతో పాటు కాకరకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కాకరకాయతో చేసే ఈ నిల్వ పచ్చడి చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. లొట్టలేసుకుంటూ అందరూ ఈ పచ్చడిని ఇష్టంగా తింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – పావుకిలో, నూనె – 5 టేబుల్ స్పూన్స్, ఆవాలు -ఒక టీ స్పూన్,జీలకర్ర – ఒక టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు -4, ఎండుమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – 50 గ్రా., ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – అర టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – ఒక టేబుల్ స్పూన్.

కాకరకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఆవాలు, మెంతులను కళాయిలో వేసి వేయించి పొడిగా చేసుకోవాలి.తరువాత కాకరకాయలపై ఉండే చెక్కును తీసేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వీటిని గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత చింతపండు గుజ్జు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలల్లో మిక్సీ పట్టుకున్న పొడి, కారం, ఉప్పు, చింతపండు మిశ్రమం వేసి కలపాలి. దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకుని ఒక రోజంతా ఊరబెట్టాలి. పచ్చడి ఊరి నూనె పైకి తేలిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ పచ్చడి తయారవుతుంది. కాకరకాయలను ఇష్టపడని వారు కూడా ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు.