Puri Curry : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా అప్పుడప్పుడూ పూరీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ పూరీలను తినడానికి చేసే కూర రుచిగా ఉంటేనే పూరీలు రుచిగా ఉంటాయి. పూరీలు మనకు హోటల్స్ లో కూడా దొరుకుతాయి. హోటల్స్ లో చేసే పూరీ కూర ఎంతో రుచిగా ఉంటుంది. అదే రుచితో ఉండే పూరీ కూరను మనం ఇంట్లోనే చాలా సులుభంగా తయారు చేసుకోవచ్చు. బయట దొరికే విధంగా ఉండే పూరీ కూరను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
మెత్తగా ఉడికించిన బంగాళాదుంపలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 6, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – పావు టీ స్పూన్, పచ్చి బఠాణీ – పావు కప్పు, ఉప్పు – తగినంత, శనగ పిండి – 2 టేబుల్ స్పూన్, నీళ్లు – 300 ఎంఎల్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పూరీ కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఆవాలను, జీలకర్రను, అల్లం ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చి మిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పచ్చి బఠాణీలను వేసి కలిపి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసుకుని వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పును వేసి కలిపి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఇప్పుడు మంటను చిన్నగా చేసి ఒక గిన్నెలో శనగ పిండి తీసుకుని నీళ్లు పోసి ఉండలు లేకుండా పలుచగా చేసుకోవాలి. దీనిని బంగాళాదుంప కూరలో వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసి కలిపి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ పూరీ కూర చల్లగా అయ్యే కొద్దీ దగ్గర పడుతుంది. కనుక కూర కొద్దిగా దగ్గర పడగానే కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే పూరీ కూర తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న కూరను పూరీలతో తింటే చాలా ఉచిగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల అచ్చం హోటల్స్ లో తయారు చేసేవిధంగా ఉండే పూరీ కూర తయారవుతుంది.