Masala Mirchi Bajji : మనం సాయంత్రం సమయాల్లో తయారు చేసుకునే చిరుతిళ్లల్లో బజ్జీలు కూడా ఒకటి. బజ్జలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం రుచికి తగినట్టు వివిధ రుచుల్లో వీటిని తయారు చేసుకుని తింటూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన బజ్జీ వెరైటీలలో మసాలా మిర్చి బజ్జీ కూడా ఒకటి. ఈ బజ్జీలు పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎంతో సులభంగా చేసుకోదగిన ఈ రుచికరమైన మసాలా బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా మిర్చి బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – 3 టేబుల్ స్పూన్స్, చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, బజ్జీ మిర్చి – 10, శనగపిండి – ఒక కప్పు, వాము – అర టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
మసాలా మిర్చి బజ్జీ తయారీ విధానం..
ముందుగా నువ్వులను వేయించి జార్ లోకి తీసుకోవాలి. వీటిని మెత్తని పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ నువ్వుల పొడిలో ఉప్పు, చింతపండు రసం వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత బజ్జీమిర్చీలకు నిలువుగా గాట్లు పెట్టుకోవాలి. తరువాత లోపల ఉండే గింజలను తీసేసి అందులో నువ్వుల మిశ్రమాన్ని స్టపింగ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. ఇందులో వాము, ఉప్పు, వంటసోడా వేసి కలపాలి.
తరువాత తగినన్ని పోసుకుంటూ పిండిని పలుచగా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక స్టఫ్ చేసుకున్న పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఈ బజ్జీలను మధ్యస్థ మంటపై గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిర్చీ బజ్జీలు తయారవుతాయి. వేడి వేడిగా వీటిని తింటే చాలా రుచిగా ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు ఇలా రుచికరమైన బజ్జీలను తయారు చేసుకుని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఈ బజ్జీలను తింటే మరింత రుచిగా ఉంటాయి.