Potato Smiley : పొటాటో స్మైలీస్.. బంగాళాదుంపలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఇవి కూడా ఒకటి. ఈ స్మైలీస్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ స్మైలీస్ మనకు ఎక్కువగా సూపర్ మార్కెట్ లలో లభిస్తూ ఉంటాయి. ఫ్రిజర్ లో వీటిని నిల్వ చేసి అమ్ముతూ ఉంటారు. చాలా మంది వీటిని బయట కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వచ్చి నూనెలో వేయించి తీసుకుంటూ ఉంటారు. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా అప్పటికప్పుడు మనం ఈ పొటాటో స్మైలీస్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. పొటాటో స్మైలీస్ ను ఇంట్లోనే రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాటో స్మైలీస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 4 ( మధ్యస్థంగా ఉండేవి), కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, బ్రెడ్ క్రంబ్స్ – అర కప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పొటాటో స్మైలీస్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసేసి ఉండలు లేకుండా మెత్తగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్మమాన్ని ఫ్రిజర్ లో అర గంట పాటు ఉంచాలి. అరగంట తరువాత బయటకు తీసి మరోసారి కలుపుకోవాలి. తరువాత ప్లాస్టిక్ కవర్ లేదా బటర్ పేపర్ ను తీసుకుని దానికి నూనె రాయాలి. తరువాత దీనిపై బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచాలి. తరువాత చపాతీ కర్రకు కూడా నూనె రాసి బంగాళాదుంప మిశ్రమాన్ని మందంగా ఉండే చపాతీలా వత్తుకోవాలి. తరువాత అంచులు పదునుగా ఉండే చిన్న గ్లాస్ లేదా చిన్న గిన్నెను తీసుకుని గుండ్రంగా కట్ చేసుకోవాలి.
ఇలా గుండ్రంగా చేసుకున్న వాటికి స్ట్రా లేదా టూత్ పిక్ తో కళ్ల మాదిరి రెండు రంద్రాలు చేయాలి. తరువాత స్పూన్ తో గుచ్చి స్మైల్ షేప్ ను ఇవ్వాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తయారు చేసుకున్న స్మైలీస్ ను నూనెలో వేసి వేయించాలి. వీటిని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో స్మైలీస్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లుల వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.