Sambar Karam : సాంబార్ కారం.. దీని గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎండుమిరపకాయలు ఎక్కువగా దొరికినప్పుడు దీనిని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. మనం చేసే వెజ్, నాన్ వెజ్ వంటకాల్లో వేపులల్లో కూడా దీనిని వేసుకోవచ్చు. అలాగే అల్పాహారాలతో కూడా దీనిని కలిపి తినవచ్చు. ఈ సాంబార్ కారాన్ని ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. మనం చేసే వంటలకు మరింత రుచిని తీసుకు వచ్చే ఈ సాంబార్ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాంబార్ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – 50 గ్రా., మెంతులు – ముప్పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 50 గ్రా., కరివేపాకు – 25 గ్రా., ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 50 గ్రా., జీలకర్ర – 25 గ్రా., వంట ఆముదం – ఒక టేబుల్ స్పూన్.
సాంబార్ కారం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ధనియాలు, మెంతులు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కరివేపాకు వేసి నీరంతా పోయి కరకరలాడే వరకు వేయించి వీటిని కూడా గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఎండుమిర్చిని వేసి చిన్న మంటపై మాడిపోకుండా వేయించి మరో గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ముందుగా వేయించిన ధనియాలు, కరివేపాకును జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి వేసి 10 సెకన్ల పాటు మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో వంట ఆముదం వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సాంబార్ కారం తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. దీనిని వంటల్లో, వేపుల్లో, దోశ, ఇడ్లీ,ఉప్మా వంటి అల్పాహారాలతో కూడా తినవచ్చు.