Calcium : మన శరీరానికి అసరమయ్యే పోషకాలన్నీ తగిన మోతాదులో లభించినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్కటి తక్కువైన కూడా దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. మన శరీరానికి ఆకృతిని ఇచ్చే ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో క్యాల్షియం పాత్ర ఎంతో ఉంటుంది. శరీరానికి తగినంత క్యాల్షియం లభించినప్పుడే మాత్రమే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది క్యాల్షియం లోపంతో బాధడుతున్నారు.
క్యాల్షియం లోపం కారణంగా ఎముకలు బలహీనంగా మారడం, చిన్న దెబ్బలకే ఎముకలు విరగడం, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, నిద్రలేమి, ఆస్ట్రియోపోరోసిస్, చర్మం పొడిబారడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా క్యాల్షియం లోపం బారిన పడిన వారికి చాలా వరకు వైద్యులు మందులను సూచిస్తారు. మందులతోపాటు క్యాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా మనం క్యాల్షియం లోపం అనే సమస్య నుండి బయటపడవచ్చు. క్యాల్షియం లోపాన్ని అధిగమించడంలో మనకు నువ్వులు ఎంతగానో సహాయపడతాయి.
క్యాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాల్షియంతోపాటు ఇతర పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి. క్యాల్షియం లోపంతో బాధపడే వారు నువ్వులను ఏవిధంగా తీసుకుంటే అధిక ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక కళాయిలో ఒక కప్పు నువ్వులను వేసి చిన్న మంటపై రంగు మారే వరకు నువ్వులను వేయించాలి. తరువాత ఈ నువ్వులను ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నువ్వుల పొడిని గాజు సీసాలో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది.
ఇలా తయారు చేసుకున్న ఈ నువ్వుల పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ పాలలో వేసి కలిపి తీసుకోవాలి. పాలు తాగడానికి ఇబ్బంది పడే వారు నువ్వుల పొడిని తిని ఒక గ్లాస్ నీటిలోనైనా తాగవచ్చు. ఈ విధంగా రోజూ రాత్రి పడుకోవడానికి అర గంట ముందు లేదా సాయంత్రం సమయంలో తీసుకోవాలి. అలాగే నువ్వుల పొడిని తీసుకుంటూనే రోజూ ఉదయం 5 లేదా 6 నానబెట్టిన బాదం గింజలను పొట్టు తీసేసి తినాలి. ఈ విధంగా నువ్వుల పొడితోపాటు బాదం గింజలను తినడం వల్ల చాలా త్వరగా క్యాల్షియం లోపం నుండి బయటపడవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గి ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా క్యాల్షియం లోపం రాకుండా ఉంటుంది.