Fruits In Monsoon : వర్షాకాలంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అలాగే అపరిశుభ్రమైన నీళ్లను తాగడం లేదా ఆహారం తినడం, దోమలు కుట్టడం వంటివి కూడా మనకు రోగాలు వచ్చేందుకు కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ సీజన్‌లో కొన్ని రకాల పండ్లను మనం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. అలాగే జ్వరం బారిన పడిన వారు త్వరగా కోలుకుంటారు. ఇక ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సి, కె, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో ఈ సీజన్‌లో వచ్చే సాధారణ ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేయవచ్చు. అలాగే నారింజ పండ్లలోనూ విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కూడా రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది. ఈ పండ్లలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల నారింజ పండ్లను ఈ సీజన్‌లో తింటే తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేయవచ్చు. అలాగే చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
బొప్పాయి చాలా మంచిది..
బొప్పాయి పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో ఉండే ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేస్తుంది. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఈ పండ్లలో విటమిన్లు ఎ, సి, ఇ ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. దీని వల్ల కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీ సైతం పెరుగుతుంది. అరటి పండ్లలో పొటాషియం, విటమిన్లు బి6, సి, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను సమతుల్యంలో ఉంచుతాయి. వర్షాకాలంలో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక అరటి పండ్లను తింటే ఎలక్ట్రోలైట్స్‌ను సమతుల్యంలో ఉంచుకోవచ్చు. అరటి పండ్లలో ఉండే విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మూడ్‌ను మారుస్తుంది. ఈ పండ్లలోని విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
యాపిల్ పండ్లలో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. వీటిలో విటమిన్లు ఎ, సి, అనేక ఫైటో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లలోని విటమిన్లు, ఫైటో న్యూట్రియెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చెర్రీ పండ్లలో విటమిన్లు ఎ, సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథో సయనిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. వాపులను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. తీవ్రమైన వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. ఇలా కొన్ని రకాల పండ్లను ఈ సీజన్‌లో ఆహారంలో భాగం చేసుకుంటే ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.