మునగకాయలను చాలా మంది రకరకాలుగా వండుకుని తింటుంటారు. కొందరు వీటిని పప్పుచారులో వేస్తారు. కొందరు వీటితో పచ్చడి పెట్టుకుంటారు. ఇంకా కొందరు వీటితో టమాటాలను కలిపి తింటారు. అయితే మునగకాయలు నిజానికి రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వీటిని తరచూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మునగ కాయల్లో సెలీనియం, జింక్ అనే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల స్త్రీ, పురుషుడు ఇద్దరిలోనూ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో సంతాన లోపం సమస్య ఉండదు. మునగకాయలను తినడం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పురుషుల్లో వీర్య కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో సంతాన లోపం సమస్య నుంచి బయట పడవచ్చు.
2. మునగకాయల్లో కాల్షియం, ఐరన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఈ క్రమంలో మునగకాయలను తరచూ తింటే ఎముకలు దృఢంగా మారుతాయి. దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది.
3. మునగకాయలను తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నందున సూక్ష్మ క్రిములు నశిస్తాయి. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వంటివి రావు. చర్మం సురక్షితంగా ఉంటుంది.
4. మునగకాయలను తినడం వల్ల గాల్ బ్లాడర్ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
5. మునగకాయల్లో పీచు పదార్థం (ఫైబర్) కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. మలబద్దకంతో బాధపడేవారు మునగకాయలను తింటే ఫలితం ఉంటుంది. సుఖ విరేచనం అవుతుంది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఔషధ గుణాలు మునగకాయల్లో ఉంటాయి.
ఇవే కాకుండా మునగకాయలను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. బాలింతల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. మునగకాయలను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు కూడా అందుతాయి. అందువల్ల దీన్ని తరచూ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.