స్నానం చేయడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ రెండు సార్లు స్నానం చేస్తే మంచిదని వైద్యులు చెబుతుంటారు. దీంతో శరీరంపై ఉండే దుమ్ము, ధూలి పోవడమే కాదు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అయితే రోజూ స్నానం వరకు ఓకే. కానీ రోజూ తలస్నానం చేయవచ్చా ? చేస్తే జుట్టుకు ఏమైనా అవుతుందా ? అని కొందరు సందేహిస్తుంటారు. మరి అందుకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
తలస్నానం రోజూ చేయాలా వద్దా అనేది జుట్టు కండిషన్, మీరు తిరిగే వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. రోజూ దుమ్ము, ధూళిలో ఎక్కువగా తిరిగే వారు రోజూ తలస్నానం చేస్తే మంచిదే. అయితే రోజూ తలస్నానం చేయడం వల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అదేమిటంటే..
మన జుట్టు కుదుళ్లు నుంచి సహజసిద్ధమైన నూనెలు స్రవించబడుతాయి. దీంతో శిరోజాలు సహజంగానే మెత్తగా, మృదువుగా మారుతాయి. అయితే రోజూ తలస్నానం చేయడం వల్ల ఆ నూనెలు స్రవించే శాతం తగ్గిపోతుంది. దీంతో జుట్టు పొడిగా మారుతుంది. అందువల్ల రోజూ తలస్నానం మంచిది కాదని కూడా చెబుతారు. కానీ దుమ్ము ధూళిలో గడిపేవారు మాత్రం కచ్చితంగా రోజూ తలస్నానం చేయాల్సిందే.
ఇక ఇతరులు ఎవరైనా సరే వారంలో 2 లేదా 3 రోజులు తలస్నానం చేస్తే చాలు. రోజూ చేయాల్సిన పనిలేదు. సాధారణ శిరోజాలు ఉన్నవారు వారంలో 3 రోజుల పాటు తలస్నానం చేయవచ్చు. ఇక జిడ్డు స్వభావం, సున్నితమైన జుట్టు ఉన్నవారు వారంలో 2 సార్లు తలస్నానం చేయాలి. దీంతో జుట్టుపై పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుంది.