అధిక బరువును తగ్గించుకునే యత్నంలో చాలా మంది ముందుగా కొవ్వు పదార్థాలను తినడం మానేస్తుంటారు. ముఖ్యంగా పాలను తాగేందుకు విముఖతను ప్రదర్శిస్తుంటారు. పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని చెప్పి బరువు తగ్గేవారు పాలను తాగడం మానేస్తారు. ఇక వెజిటేరియన్ డైట్ పేరు చెప్పి కొందరు కేవలం సోయా పాలు, బాదం పాలనే తాగుతుంటారు. అయితే ఇవి కాకుండా స్కిమ్మ్‌డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్ అని మనకు రెండు రకాల పాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి అర్థాలు ఏమిటి ? అధిక బరువు తగ్గేందుకు ఈ రెండు పాలలో ఏ పాలను నిత్యం తాగాల్సి ఉంటుంది ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్కిమ్మ్‌డ్ మిల్క్
స్కిమ్మ్‌డ్ మిల్క్ లో కొవ్వు ఉండదు. కొందరు సున్నా శాతంతో ఈ పాలను తయారు చేస్తారు. అయితే కొందరు స్వల్ప మోతాదులో కొవ్వును ఉంచుతారు. అందువల్ల ఈ పాలలో 0.5 గ్రాములు లేదా అంతకన్నా తక్కువగానే కొవ్వు ఉంటుంది. హోల్ మిల్క్‌లా స్కిమ్మ్‌డ్ మిల్క్ లో కొవ్వు ఎక్కువగా ఉండదు. ఒక గ్లాస్ హోల్ మిల్క్‌లో 10 గ్రాముల వరకు కొవ్వు ఉంటుంది. కానీ ఒక గ్లాస్ స్కిమ్మ్‌డ్ మిల్క్ లో 2 గ్రాములు అంతకన్నా తక్కువగానే కొవ్వు ఉంటుంది. ఇక హోల్ మిల్క్ కన్నా స్కిమ్మ్‌డ్ మిల్క్ లోనే కాల్షియం, ప్రోటీన్లు, ఫాస్ఫరస్, విటమిన్ డి, ఎ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. స్కిమ్మ్‌డ్ మిల్క్ తేలిగ్గా జీర్ణమవుతాయి.
డబుల్ టోన్డ్ మిల్క్
ఇక డబుల్ టోన్డ్ మిల్క్ విషయానికి వస్తే.. ఈ పాలను.. హోల్ మిల్క్, స్కిమ్మ్‌డ్ మిల్క్ లను కలిపి తయారు చేస్తారు. లేదా స్కిమ్మ్‌డ్ మిల్క్ పౌడర్ ను ఉపయోగించి డబుల్ టోన్డ్ మిల్క్‌ను తయారు చేస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియలో గేదెలకు చెందిన హోల్ మిల్క్ ను ఉపయోగిస్తారు. ఆ పాలను స్కిమ్మ్‌డ్ మిల్క్ తో కలిపి డబుల్ టోన్డ్ మిల్క్ ను తయారు చేస్తారు. ఈ పాలలో కొవ్వు 1.5 శాతం కన్నా తక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారు ఈ పాలను తాగితే ఎంతో మంచిది. ఈ పాలు తేలిగ్గా జీర్ణమవుతాయి. వీటిలో విటమిన్ డి ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
ఏ పాలు మంచివి ?
చివరిగా.. అధిక బరువును తగ్గించేందుకు ఏ పాలు మంచివి ? అంటే.. స్కిమ్మ్‌డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్.. రెండూ మంచివే. కానీ అధిక బరువు తగ్గేందుకు మాత్రం స్కిమ్మ్‌డ్ మిల్క్ ఉత్తమమైనవని చెప్పవచ్చు. ఎందుకంటే డబుల్ టోన్డ్ పాల కన్నా స్కిమ్మ్‌డ్ మిల్క్ లోనే కొవ్వు తక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. అందువల్ల బరువు తగ్గేందుకు స్కిమ్మ్‌డ్ మిల్క్ సహాయ పడతాయి. డైట్ పాటించే వారు ఈ పాలను తాగడం ఉత్తమం అని చెప్పవచ్చు.