Ishan Kishan : భారత్, శ్రీలంక జట్ల మధ్య ధర్మశాలలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం విదితమే. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. భారత బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడారు. దీంతో కొన్ని బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ తలకు బలమైన గాయమైంది. దీంతో అతన్ని హాస్పిటల్‌కు తరలించారు.
శ్రీలంకతో ధర్మశాలలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సమయంలో బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ తలకు గాయమైంది. దీంతో అతన్ని హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో ఉన్న ఓ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఇషాన్ కిషన్‌కు వైద్యులు పరీక్షలు చేశారు. అతని తలకు సిటి స్కాన్ చేసినట్లు డాక్టర్ శుభమ్ తెలిపారు. ప్రస్తుతం కిషన్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచామని తెలిపారు.
అలాగే ఓ లంక ప్లేయర్‌కు కూడా చేతి బొటన వేలి గాయం కావడంతో అతన్ని కూడా హాస్పిటల్‌కు తీసుకువచ్చారని.. డాక్టర్ శుభమ్ వెల్లడించారు. ఈ క్రమంలో ఇద్దరు ప్లేయర్లను ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. కాగా రెండో టీ20 మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజాలు కూడా విజృంభించారు. దీంతో భారత్ సునాయాసంగా విజయం సాధించగలిగింది. ఈ క్రమంలో మూడు టీ20 ల సిరీస్‌ను ఇండియా 2-0తో ఇప్పటికే కైవసం చేసుకుంది.