Banana Ghee : అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే అరటిపండు, నెయ్యిని కలిపి తినడం వల్ల ఇంకా ఎంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అరటి పండు, నెయ్యిల ద్వారా మన శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. దీంతో అనేక వ్యాధులు తగ్గిపోతాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే ఈ రెండింటినీ కలిపి తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అరటి పండ్ల ద్వారా మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు లభిస్తాయి. దీంతో జీర్ణశక్తి మెరుగు పడుతుంది. నీరసం తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. అలాగే అధిక బరువు పెరగాలని చూస్తున్న వారికి ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. దీంతోపాటు జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
2. అరటి పండు, నెయ్యి.. రెండింటినీ కలిపి తినడం వల్ల అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా గ్యాస్, మలబద్దకం, అసిడిటీ తగ్గుతాయి.
3. బక్క పలుచగా ఉన్నవారు.. అధిక బరువు త్వరగా పెరగాలంటే.. రోజూ అరటిపండ్లు, నెయ్యి మిశ్రమాన్ని తీసుకోవాలి. దీంతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరుగుతారు. కండరాలు దృఢంగా మారుతాయి. ఇక రోజూ శారీరక శ్రమ అధికంగా చేసేవారితోపాటు వ్యాయామం ఎక్కువగా చేసేవారికి కూడా ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. కండరాలు నిర్మాణమై చక్కని శరీరాకృతిని పొందుతారు.
4. అరటి పండు, నెయ్యి మిశ్రమం చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల చర్మంలో ఉండే సహజ కాంతి బయటకు వస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. మెరుస్తుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.
5. అరటి పండు, నెయ్యి మిశ్రమం పురుషులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది వారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. శృంగార సమస్యలు తగ్గుతాయి. వీర్యం అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
ఇక అరటి పండు, నెయ్యి మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకోవాలి. ముందుగా ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో 2 టీస్పూన్ల నెయ్యి వేయాలి. తరువాత బాగా పండిన 2 అరటి పండ్లను తీసుకుని గుజ్జు తీసి ఆ పాత్రలో వేసి బాగా కలపాలి. మిశ్రమం బాగా కలిసేంత వరకు తిప్పాలి. దీంతో మెత్తని గుజ్జులా అవుతుంది. దీన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే తినాలి. అయితే అంత సమయం ఉదయం లేదని భావించేవారు దీన్ని సాయంత్రం 7 గంటల లోపు కూడా తీసుకోవచ్చు. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితాలు వస్తాయి.